డ్వాక్రా మహిళలకు ఏపీ సీఎం చంద్రబాబు అందజేస్తున్న పసుపు-కుంకుమ చెక్కులు చెల్లవంటూ.. వైసీపీ అధినేత జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని  ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. చెల్లకుండా పోవడానికి ఆ సొమ్ము జగన్ ది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

సోమవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటమి భయంతోనే వైసీపీ ఘర్షణ వాతావరణం సృష్టిస్తోందని దుయ్యబట్టారు. పసుపు-కుంకుమ చెక్కులు చెల్లవంటూ చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని మంత్రి యనమల సూచించారు. అవి పేదలకు ప్రభుత్వం ఇచ్చే కానుకలని తెలిపారు.

ఆ కానుకలు ప్రజలకు అందేందుకు.. బ్యాంకుల్లో రూ.2,350కోట్లు డిపాజిట్ చేశామని.. ఇప్పటికే ఆర్థిక శాఖ రూ.4,100 కోట్లు విడుదల చేసిందని ఆయన తెలిపారు. నిర్దేశిత తేదీల్లో ప్రతి మహిళకు నగదు అందుతుందని ఆయన స్పష్టం చేశారు. జగన్ మోసగాళ్లకే మోసగాడని..  వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మొద్దని సూచించారు.