ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తన అభిమానాన్ని చాటుకున్నారు. తన రాజకీయ జీవితం జగన్ పెట్టిన భిక్ష అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తన అభిమానాన్ని చాటుకున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వేదికగా సీఎం జగన్ ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. జై జగనన్న.. జై జై జగనన్న అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ‘‘ఆరోగ్య రంగ సంస్కర్త, పేదల గుండెల్లో నిలిచిన నేత, మన అందరి అభిమాన నేత వైఎస్ జగన్‌కు చిలకలూరిపేట నియోజకవర్గాని వచ్చినందుకు ఇక్కడి ప్రజలందరి తరపున పాదాభివందనాలతో స్వాగతం పలుకుతున్నాను’’ అని అన్నారు.
సీఎం జగన్ సంక్షేమ పథకాలతో చరిత్ర సృష్టిస్తున్నారని అన్నారు. తాను జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. ఒక సాధారణ బీసీ మహిళ అయిన తనకు చిలకలూరిపేట నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేను చేశారని, తర్వాత మంత్రిని చేశారని చెప్పారు. తనకు ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి, రాజకీయ జీవితం.. జగన్ పెట్టిన భిక్ష అని.. ఆయన రుణం తీర్చుకోలేనని చెప్పారు. ఈ సమయంలో విడదల రజిని భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. జగన్ ఆశయాల సాధనే లక్ష్యంగా, నాయకత్వమే అదృష్టంగా.. తనకు అప్పగించిన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటూనే ఉంటానని చెప్పారు.
2007లో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం తీసుకొచ్చారని.. అది దేశానికే దిక్సూచిగా నిలిచిందని చెప్పారు. 16 ఏళ్ల తర్వాత పేదలకు మంచి చేయాలని రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా ఆవిష్కరించాలని సీఎం జగన్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారని చెప్పారు. గ్రామాల్లోని పేదలకు ఇంటి వద్దే వైద్య సేవలు అందించాలనేది సీఎం జగన్ లక్ష్యమని తెలిపారు.
40 ఇయర్స్ అని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటారని.. ఆయన పాలనలో ఏ రోజైనా ఆస్పత్రులకు సరైన వైద్యులను నియమించాలని రిక్రూట్‌మెంట్ చేశారా?, ఒక్క కొత్త ఆస్పత్రి బిల్డింగ్ అయినా కట్టారా? అని ప్రశ్నించారు. ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టాడని విమర్శించారు. దోమలపై దండయాత్ర అంటూ కాలక్షేపం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నలుగురు ఎమ్మెల్యేలను కొనవచ్చని.. సీఎం జగన్ కోసం ప్రాణాలు ఇచ్చే 4 కోట్ల ప్రజలను మాత్రం కొనలేడని అన్నారు.
