విగ్రహాల ధ్వంసం కేసులో ఎవరున్నారో సిట్ విచారణలో తేలుతుందన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన .. టీడీపీ, బీజేపీ మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నాయని మంత్రి ఆరోపించారు.

మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగా వున్న సమయంలో 40 దేవాలయాలు కూల్చారని.. జీవీఎల్ ఎప్పుడైనా రాజ్యసభలో ఏపీ ప్రయోజనాల కోసం మాట్లాడారా అని వెల్లంపల్లి ప్రశ్నించారు. విగ్రహాల ధ్వంసం వెనుక రాజకీయ నేతలున్నారని మంత్రి ఆరోపించారు.

అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లోని పలు దేవాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపించేలా చూడాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఏపీలో జరిగిన పలు ఘటనలను ప్రస్తావించిన ఆయన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే వీటికి కారణమని జీవీఎల్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల్లో జరుగుతున్న దాడులను సభతో పాటు దేశం దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానని నరసింహారావు తెలిపారు.

ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలిచే విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో ఇటీవల జరిగిన ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని జీవీఎల్ గుర్తుచేశారు.

గత ఏడాదిన్నర కాలంలో ఏపీలో ఈ తరహా దాడులపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోవటమే ఇందుకు కారణమని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఘటనలు రాష్ట్రంలోనేగాక దేశవ్యాప్తంగా ఉన్న హిందువులను బాధిస్తాయని నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు.