ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఈ క్రమంలో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పూర్తిగా నిండిపోయింది. ఈ క్రమంలో నదీ తీరం వెంట వున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం ముంపునకు గురయ్యే అవకాశం వుంది.

ఈ క్రమంలో వైసీపీ నేత ఆర్కే ఇప్పటికే బాబు నివాసాన్ని పరిశీలించగా.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇదే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నది ఒడ్డున నివసిస్తున్నారని.. ప్రకాశం బ్యారేజ్‌కు వరద రావడంతో బాబు హైదరాబాద్‌కు పారిపోయారని వ్యాఖ్యానించారు.

వరద వస్తే నదీ పరివాహక ప్రాంతంలో ముప్పు వస్తుందని సీఎం జగన్ ముందే హెచ్చరించారని వెల్లంపల్లి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి మంచి చెప్పినా ఆనాడు చంద్రబాబు రాజకీయ కోణంలోనే చూశారని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.

మరోవైపు ప్రకాశం బ్యారేజ్ నుంచి 4.47 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి అధికారులతో కలిసి బ్యారేజ్ వద్ద పరిస్థితిని సమీక్షించారు.

నాగాయలంక, కంచికచర్లచ, భవానీపురంలలో లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు నదిలోకి దిగవద్దని.. ముందు జాగ్రత్త చర్యగా గజ ఈతగాళ్లు, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. 

ప్రమాదంలో మాజీ సీఎం చంద్రబాబు నివాసం.. పరిశీలించిన ఆర్కే

చంద్రబాబుని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది... ఎమ్మెల్యే ఆళ్ల