రాజకీయాలకు పనికిరాని వ్యక్తి పవన్ కల్యాణ్ అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్యాకేజీకి అమ్ముడుపోయిన వ్యక్తి పవన్ అని మంపడ్డారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. 

అసెంబ్లీ ముట్టడిస్తామన్న పవన్‌కు.. అసెంబ్లీ ఎక్కడుందో తెలుసా అని ప్రశ్నించారు. పవన్ సినిమాల్లో పేమెంట్ తీసుకుని ఎలా నటిస్తున్నారో..రాజకీయాల్లో కూడా అలానే నటిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా.. పవన్... ఇటీవల అధికార వైసీపీ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పవన్ విమర్శలకు వైసీపీ నేతలు ప్రతి విమర్శలు చేస్తుండటం గమనార్హం.

కాగా.. సోమవారం విజయవాడలో పర్యటించిన పవన్.. వైసీపీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. రాజకీయం ఓ కుటుంబానికి, కులానికి స్వంతం కాదని వైసీపీ తెలుసుకోవాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.

సోమవారం నాడు కృష్ణా జిల్లాలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పర్యటించారు. వైసీపీకి పేకాట క్లబ్బులపై ఉన్న శ్రద్ద రోడ్లు బాగు చేయడంలో లేదన్నారు.

రైతులకు న్యాయం జరిగే వరకు ఎంతదూరమైనా వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం పాలనను ముందుకు తీసుకుపోవడం లేదన్నారు. దురుసుగా మాట్లాడే వైసీపీ నేతలను జనసేన బలంగా ఎదుర్కొంటుందన్నారు.

తుఫాన్ దెబ్బకు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 35 వేల పరిహారం ఇవ్వకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని ఆయన ప్రకటించారు. రైతు కన్నీళ్లు తుడవలేనప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. 

అన్నం పెట్టే రైతు ఏడిస్తే క్షేమం కాదన్నారు. 80 లక్షల మంది రైతుల కుటుంబాలకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు.

రైతుల కోసం మేం రోడ్డు మీదకు రావడం రాజకీయమా అని ఆయన ప్రశ్నించారు.  అసెంబ్లీ విశాఖపట్టణంలో పెట్టినా... పులివెందులలో పెట్టినా అక్కడకు వచ్చి రైతుల తరపున తమ గళం విన్పిస్తామన్నారు.

తాను సినిమాలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నానని ఆయన చెప్పారు. ఇందులో తప్పేం ఉందని ఆయన ప్రశ్నించారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డికి సిమెంట్ ఫ్యాక్టరీలు  మైనింగ్, పేపర్,, వేల కోట్లు లేవని  ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల గురించి పట్టించకొనేవారైతే  వేల కోట్ల కాంట్రాక్టులు ఎందుకు తీసుకొంటున్నారని ఆయన ప్రశ్నించారు.

తాను ఖాళీ సమయాల్లో సినిమాలు చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేల మాదిరిగా  పేకాట క్లబ్బుల్లో ఉండనని ఆయన చెప్పారు.వైసీపీ ఎమ్మెల్యేలు పేకాట క్లబ్బులు,  మద్యం దుకాణాలు, ఇతర వ్యాపారాలు  మూసుకొంటే  తాను కూడ సినిమాలు మానుకొంటానని ఆయన చెప్పారు.  మద్యంపై ఆదాయాన్ని ప్రభుత్వం వదులుకోవాలని ఆయన సూచించారు. 

మంత్రి పేర్ని నాని సీఎం జగన్ కు చిడతలు కొట్టడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. పదవులు కాపాడుకొనేందుకు తనను విమర్శిస్తున్నాడన్నారు. ప్రజలను, రైతులను కాపాడటానికే మంత్రి పదవిని ఉపయోగించుకోవాలని ఆయన మంత్రి నానికి సూచించారు.

నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.