ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ టీచర్ అవతారం ఎత్తారు. పూర్తిగా ఆంగ్ల మీడియంలోనే బోధించడం విశేషం. పలు ప్రశ్నలు సంధించి.. పిల్లల నుంచి సమాధానాలను రాబట్టారు.
ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ టీచర్ అవతారం ఎత్తారు. వివరాల్లోకి వెళితే... శనివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ హైస్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం పంతులమ్మ అవతారం ఎత్తిన మంత్రి 6వ తరగతి విద్యార్ధులకు పాఠాలు బోధించారు. ఆమె పూర్తిగా ఆంగ్ల మీడియంలోనే బోధించడం విశేషం. పలు ప్రశ్నలు సంధించి.. పిల్లల నుంచి సమాధానాలను రాబట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను మంత్రి ఉషశ్రీ చరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇకపోతే.. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా టీచర్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. మేడికొండూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు. క్లాస్ రూమ్‌లోకి వెళ్లి... చేతిలో పాఠ్య పుస్తకం పెట్టుకుని పాఠాలు చెప్పారు. అది కూడా విద్యార్ధులకు అర్థమయ్యేలా బోర్డుపై చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు ఎమ్మెల్యే. బయో సైన్సులోని రిప్రొడక్టీవ్ సిస్టం గురించి బోధించి... అనంతరం పలు ప్రశ్నలు వేసి పిల్లల నుంచి సమాధానాలు కూడా రాబట్టారు.
ALso REad:పంతులమ్మ అవతారమెత్తిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. బోర్డుపై వివరిస్తూ విద్యార్ధులకు పాఠం (వీడియో)
సమయాన్ని వృథా చేయకుండా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు శ్రీదేవి. పదో తరగతిలో పదికి పది మార్కుల సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఎమ్మెల్యే సూచించారు. ఏదేమైనా నిత్యం ప్రజా సమస్యలు, రాజకీయాలు, వివిధ పనులతో క్షణం తీరిక లేకుండా వుండే ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తనలో ఉన్న మరో కొత్త టాలెంట్‌ను అందరికీ పరిచయం చేశారు. ప్రస్తుతం ఆమె పాఠాలు చెబుతోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
