కురుపాం: ప్రజారోగ్య పరిరక్షణ కోసమే ప్రభుత్వం సూక్ష్మ పోషకాలు కలిగిన బలవర్ధకపు బియ్యం (పోర్టిఫైడ్ రైస్) సరఫరా చేయడం జరుగుతోందన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి. కాబట్టి ఈ బియ్యంపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని... వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల్లో ఈ పోర్టిఫైడ్ బియ్యంపై అపోహలు ఉన్నాయని... అయితే ఇవి ప్రజల ఆరోగ్యం కోసం విటమిన్లు, పోషకాలను కలిపిన సాధారణ బియ్యమేనని మంత్రి స్పష్టం చేసారు. 

కురుపాం నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం పోర్టిఫైడ్ బియ్యం పంపిణీని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగానే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ... విజయనగరం జిల్లా వ్యాప్తంగా 7లక్షల కుటుంబాలకు ఈ బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలందరి ఆరోగ్యాలకు పరిరక్షించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు.
  
పోర్టిఫైడ్ బియ్యంపై ప్రజల్లో పలురకాల అపోహలు ఉన్నాయని...ఇవి సాధారణ బియ్యం కాదని ప్లాస్టిక్ బియ్యమని కూడా కొందరు అపోహపడుతున్నారని చెప్పారు. ఈ కారణంగానే కొంతమంది ఈ బియ్యాన్ని తాము సద్వినియోగం చేసుకోకుండా మార్కెట్లో ఇతరులకు ఇచ్చేయడం లాంటి పనులు చేస్తున్నారన్నారు. అయితే ఈ బియ్యంపై ప్రజల్లో ఉన్న అపోహల్లో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. ఈ బియ్యాన్ని మిల్లింగ్ చేసే సమయంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12 కలుపుతారని వివరించారు. 

సూక్ష్మసోషకాలను కలగలిపిన ఈ బియ్యాన్ని తిన్నవారికి పోషకాలు బాగా అందుతాయని, శరీరంలో నాడీ వ్యవస్థ మెరుగ్గా పని చేస్తుందని, గర్భిణీ స్త్రీలలో పిండం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రస్తుతం కురుపాం నియోజకవర్గంలో 5 మండలాల్లో 73,391 బియ్యం కార్డులు ఉన్నాయని... ప్రతి నెలా 1620 మెట్రిక్ టన్నుల బియ్యం అందిస్తున్నామన్నారు. నియోజకవర్గ పరిధిలో ఫిబ్రవరి 2021 నుండి 108 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ద్వారా ఇంటింటికీ బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతుందన్నారు. 

read more  యువ సీఎం నాయకత్వంలో అద్భుతాలు...: విజయసాయి రెడ్డి

ఈ నెల నుంచి కురుపాం నియోజకవర్గ అన్ని మండలాల్లోనూ సూక్ష్మ పోషకాలున్న బలవర్ధక బియ్యాన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ బియ్యాన్ని తయారు చేయించి పంపిణీ చేస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా 7 లక్షల కార్డుదారులకు ఈ బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోందని పుష్ప శ్రీవాణి వెల్లడించారు. 

రాష్ట్రంలో ప్రజలందరి ఆరోగ్యాలను పరిరక్షించడానికి, పేదలకు కూడా అత్యాధునికమైన వైద్య సదుపాయాలను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రూ.8 వేల కోట్లతో నిర్మించనున్న 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేసారు. అత్యవసరమైన వైద్య సేవలు, అత్యాధునిక చికిత్సల కోసం రాష్ట్రానికి చెందిన ప్రజలు ఇతర రాష్ట్రాలలోని నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలతో పాటుగా మొత్తం 16 ప్రాంతాల్లో మెడికల్ హబ్ లను ఏర్పాటు చేసే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని పుష్ప శ్రీవాణి ఉద్ఘాటించారు. 

మంత్రి శ్రీవాణి చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్వతీపురం సబ్ కలెక్టర్ విధేకర, కురుపాం గ్రామ సర్పంచ్ గార్ల సుజాత, కళింగ వైశ్య, ఐరక కార్పొరేషన్ డైరెక్టర్లు కె.సురేష్, గవర విజయ్, కళింగ వైశ్య జిల్లా అధ్యక్షుడు అందవరపు కోటేశ్వరరావు, నాయకులు శెట్టి నాగేశ్వరావు, కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.