ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు విషయంలో మరో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆయనపై మంత్రి శ్రీరంగనాథరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు పోలీసు స్టేషన్ లో ఆయన రఘురామకృష్ణమ రాజుపై ఫిర్యాదు చేశారు. 

తనపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణమ రాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని శ్రీరంగనాథ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘురామ కృష్ణమ రాజు వ్యాఖ్యలు తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆయన ఫిర్యాదులో ఆరోపించారు. రఘురామకృష్ణమ రాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

మంత్రి శ్రీరంగనాథ రాజు ఫిర్యాదు ఎంపీ రఘురామకృష్ణమ రాజు స్పందించారు. శ్రీరంగనాథరాజు చేసిన పని సరైంది కాదని ఆయన అన్నారు. తన దిష్టిబొమ్మను దగ్ధం చేసిన విషయంపై తాను ఫిర్యాదు చేసి 20 రోజులు అవుతోందని, ఇప్పటి వరకు కేసు పెట్టలేదని ఆయన అన్నారు. ఇప్పుడు తానే మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసినట్లు తప్పుడు ఫిర్యాదు చేశారని ఆయన అన్నారు. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో రఘురామకృష్ణమ రాజు తిరుగుబాటు బావుటా ఎగురేసిన విషయం తెలిసిందే. రఘురామకృష్ణమ రాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ ఎంపీలు లోకసభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు కూడా చేశారు. తాను జగన్ ను ఏమీ అనలేదంటూనే రఘురామకృష్ణమ రాజు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.