Asianet News TeluguAsianet News Telugu

సింహం ఒక్క అడుగు వెనక్కి వేస్తే ఓడిపోయినట్టు కాదు.. పులివెందుల చెక్ పోస్టును కూడా తాకలేరు: మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. సింహం ఒక్క అడుగు వెనక్కి వేస్తే ఓడిపోయిననట్టు కాదని.. రెట్టింపు బలంతో వేటాడటానికి సిద్దంగా ఉందని తెలుసుకోవాలని అన్నారు.
 

minister roja slams tdp and 4 suspended ysrcp mlas ksm
Author
First Published Mar 26, 2023, 1:39 PM IST

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలిచి చంద్రబాబు నానా హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. సింహం ఒక్క అడుగు వెనక్కి వేస్తే ఓడిపోయిననట్టు కాదని.. రెట్టింపు బలంతో వేటాడటానికి సిద్దంగా ఉందని తెలుసుకోవాలని అన్నారు. 2024లో 175కు 175 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పులివెందుల సీటు వారిదని కొందరు అంటున్నారని.. పులివెందు సీటు కాదు కదా.. పులివెందుల చెక్ పోస్టును  కూడా తాకే దమ్ము, ధైర్యం ఉన్న మగాడు ఇంకా ఏపీలో పుట్టలేదని అన్నారు.  

సీఎం వైఎస్ జగన్ మహిళల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. మహిళ ముఖ్యమంత్రులు  ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా జరగడం లేదని అన్నారు. మంచి చేస్తేనే ఓటు వేయాలని చెబుతున్న గొప్ప నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు. అటువంటి గొప్ప నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మహిళలందరిపైనా ఉందని తెలిపారు. 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో అంతా చూశారని అన్నారు. ఎన్టీఆర్‌కు వెనుపోటు పొడిచినప్పటీ నుంచి చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తూనే ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ది, సంక్షేమం గురించి పట్టించుకున్న దాఖాలు లేవని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉంటే కూడా వాటి గురించి మాట్లాడరని విమర్శించారు. ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడానికి నలుగురు ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని ఆరోపించారు. అదేదో ఘనకార్యం అయినట్టుగా సంబరపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు నలుగురు అమ్ముడుపోయే ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి కొనగలరేమో గానీ.. సీఎం జగన్‌ను గుండెల్లో పెట్టుకున్న కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని కొనలేరని అన్నారు. 

21 ఎమ్మెల్సీ స్థానాల్లో 17 స్థానాలను వైసీపీ గెలిస్తే మాట్లాడటం  లేదని.. చంద్రబాబు అడ్డదారిలో ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిస్తే నానా హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ను మోసం చేసినవాళ్లు చరిత్ర హీనులయ్యారని అన్నారు. చరిత్రను చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందని చెప్పుకొచ్చారు. ‘‘ఎమ్మెల్యేలను, ఎంపీలను తాను తయారు చేసుకున్నానని జగన్ ఎప్పుడూ చెబుతారు. తన సైన్యంలో ఎవరైనా అమ్ముడుపోతే మళ్లీ తయారు చేసుకుంటాను కానీ.. భయపడనని అంటారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే.. 2019లో కొత్త ఎమ్మెల్యేలను, ఎంపీలను తయారు చేసుకున్నారు. అప్పుడు అమ్ముడుపోయినవారు తర్వాత ఓడిపోయి రాజకీయంగా సూసైడ్ చేసుకున్న పరిస్థితి. ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా అది తెలుసుకోవాలి’’ అని రోజా అన్నారు.  

సస్పెండ్ అయిన  నలుగురు ఎమ్మెల్యేలు డ్రామాలు  ఆడటం ఆపాలని రోజా  అన్నారు. వారికి పార్టీలో గానీ.. ప్రజల్లో గానీ ఎటువంటి సానుభూతి ఉండదని చెప్పారు. వారంతా జగన్ చరిష్మాతో గెలిచినవారేనని అన్నారు. ఆ ప్రాంతాల్లో కొత్తవారిని నిలబెట్టి  గెలిపించుకునే సత్తా జగన్‌కు ఉందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios