వాడు ప్యాకేజీ స్టార్... వీడు స్కిల్డ్ దొంగ... ఇద్దరూ తోడుదొంగలే : పవన్, చంద్రబాబుపై రోజా ఫైర్
టిడిపి, జనసేన పొత్తు ప్రకటనపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ తోడుదొంగలేనని మరోసారి బయటపడిందని అన్నారు.

మచిలీపట్నం : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, తర్వాతి పరిణామాలతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం జనసేనాని పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేసారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, జనసేన కలిసి పోటీచేస్తాయంటూ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. ఈ పొత్తు ప్రకటనపై తాజాగా మంత్రి రోజా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ వేర్వేరు కాదు... ఇద్దరూ తోడుదొంగలేనని బయటపడిందని అన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ అని... ప్రజల కోసం కాకుండా ప్యాకేజీ కోసమే పనిచేసే నాయకుడని ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యిందని మంత్రి అన్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రోజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.తనను ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అంటే చెప్పుతో కొడతానన్న పవన్ ఇప్పుడేమంటారు... తన చెప్పుతో తాను కొట్టుకుంటాడా లేదంటే జైల్లో ములాఖత్ అయిన పెద్దమనిషి చంద్రబాబును కొడతాడా అంటూ మండిపడ్డారు. ఇప్పటికే పొత్తులో వున్న బిజెపితో చర్చించకుండానే... చివరకు జనసేన పార్టీలో పెద్ద నాయకులుగా చెప్పుకునే నాదెండ్ల మనోహర్, నాగబాబుకు చెప్పకుండానే పవన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడని అన్నారు. జైల్లో వున్న దొంగతో భారీ ప్యాకేజీ మాట్లాడుకుని ఎవ్వరికీ చెప్పకుండానే పవన్ పొత్తు పెట్టకున్నారని రోజా ఆరోపించారు.
పవన్ ప్యాకేజీల కోసమే పార్టీ పెట్టాడని ప్రజలకు తెలుసన్నారు రోజా. అందువల్లే 2019 ఎన్నికల్లో పోటీచేసిన రెండు చోట్ల ప్యాకేజీ స్టార్ ని ప్రజలు ఓడించారన్నారు. పవన్ కల్యాణ్ అనేవాడు ప్యాకేజీ స్టార్, పొత్తుల స్టార్ అని ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. తన సినిమాలోనే 'నాకు కొంచం తిక్కుంది... దానికి లెక్కుంది' అని పవన్ అంటాడు కదా... ఆయన తిక్క జనసైనికులు, లెక్క ప్యాకేజీ అని రోజా ఎద్దేవా చేసారు.
Read More బాబు సీట్లో కూర్చున్న బాలక్రిష్ణ, పవన్ కల్యాణ్ ను దించారు: రోజా
గతంలో వైఎస్ జగన్ ను ఉద్దేశించి వాళ్ల నాన్నే నన్నేం పీకలేడు... నా రాజకీయ అనుభవం అంత లేదు అతడి వయసు అంటూ చంద్రబాబు మాట్లాడారని రోజా గుర్తుచేసారు. ఇలా అధికార మదంతో విర్రవీగుతూ మాట్లాడిన చంద్రబాబు సాక్ష్యాధారాలతో దొరకిపోయి జైల్లో వున్నాడు... ఇప్పుడు లోకేష్ కూడా అలాగే మాట్లాడుతున్నాడన్నారు. తర్వాత జైలుకు వెళ్లేది నువ్వే నాయనా... రెడీగా వుండు అంటూ లోకేష్ ను హెచ్చరించారు మంత్రి రోజా.
చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడో, ఎంత స్కిల్డ్ గా దోపిడీకి పాల్పడతాడో దేశ ప్రజలకు చెప్పడానికి నారా భువనేశ్వరి, లోకేష్ డిల్లీకి వెళుతున్నారంటూ రోజా ఎద్దేవా చేసారు. నిజంగానే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం జరగలేదని... అవినీతి సొమ్ము తమకు అందకుంటే దీనిపై సిబిఐ, ఈడి విచారణ కోరాలని భువనేశ్వరి, లోకేష్ లకు సవాల్ చేసారు. నారావారిపల్లెలో సెంటు భూమి కలిగిన కుటుంబంలో పుట్టిన చంద్రబాబు వేలకోట్లకు అధిపతి ఎలా అయ్యాడో ప్రజలందరికీ తెలుసని మంత్రి రోజా అన్నారు.