బాబు సీట్లో కూర్చున్న బాలక్రిష్ణ, పవన్ కల్యాణ్ ను దించారు: రోజా
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలులో టిడిపి అధినేత చంద్రబాబును కలిసి, తాము టిడిపితో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించడంపై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ: తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సీట్లో ఎమ్మెల్యే బాలక్రిష్ణ కూర్చోవడంపై, ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబును జైల్లో కలిసి టిడిపితో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యే రోజా సంచలన ప్రకటన చేశారు. తన సీట్లో పవన్ కల్యాణ్ కూర్చున్న 40 గంటల్లోనే పవన్ కల్యాణ్ ను చంద్రబాబు రంగంలోకి దించారని ఆమె వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అరెస్టయిన తర్వాత బాలక్రిష్ణ సినిమా షూటింగులు రద్దు చేసుకుని మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత పవన్ కల్యాణ్ రాజమండ్రి కేంద్ర కారాగారంలో చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత తాము టిడిపితో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రోజా ఆ వ్యాఖ్యలు చేశారు.
పక్కా ప్రణాళిక ప్రకారమే పవన్ కల్యాణ్ ను చంద్రబాబు రంగంలోకి దించారని రోజా అన్నారు. ప్యాకేజీ కోసం జనసేన కార్యకర్తలను పవన్ కల్యాణ్ తాకట్టు పెట్టారని ఆమె ఆరోపించారు. వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని రోజా ధీమా వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.
చంద్రబాబుపై పెట్టింది అక్రమ కేసు కాదని, అడ్డంగా దొరికిపోయిన కేసు అని రోజా శుక్రవారం మీడియా సమావేశంలో అన్నారు. చంద్రబాబు తప్పు చేయకపోతే తన ఆస్తులపై సిబిఐ విచారణకు డిమాండ్ చేయాలని రోజా అన్నారు. పవన్ కల్యాణ్ కు కనీపం తెలివి కూడా లేదని, చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టి దొరికిపోయిన దొంగ అని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంపై ఆదాయం పన్ను శాఖ, జీఎస్టీ, ఈడిలు విచారణ జరిపినట్లు ఆమె తెలిపారు.
తన తండ్రి మీద చెప్పులు వేసిన చంద్రబాబునే బాలక్రిష్ణ ఏమీ చేయలేకపోయారి, ఇక సిఎం జగన్ ను ఏం చేగలరని ఆమె అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో తన పాత్ర లేకపోతే చంద్రబాబు సిబిఐ, ఈడి విచారణలు కోరాలని రోజా అభిప్రాయపడ్డారు.