ప్లూటు జింక ముందు ఊదు... జగన్ ముందు కాదు: బాలకృష్ణకు రోజా వార్నింగ్
చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఇవాళ ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై మంత్రి రోజా స్పందించారు. ముఖ్యంగా హీరో బాలకృష్ణపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ చోటుచేసుకున్న పరిస్థితులపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చాలా దారుణంగా ప్రవర్తించారని... పవిత్రమైన చట్టసభలో ఇలా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నానని అన్నారు. శాసనసభలో టిడిపి సభ్యులు సైకోల్లా ప్రవర్తించారని రోజా మండిపడ్డారు.
స్కిల్ డెవలప్ మెంట్ పథకంలో భారీ స్కాం జరిగిందని... సమగ్ర విచారణ తర్వాతే చంద్రబాబను సిఐడి అరెస్ట్ చేసిందని రోజా తెలిపారు. చంద్రబాబు అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు పోలీసుల వద్ద వున్నాయన్నారు. చంద్రబాబు పెద్ద దోపిడీ దొంగ అని ప్రజలకు అర్థమయ్యిందన్నారు. తప్పు చేసినట్లు బయటపడినా చంద్రబాబు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని... కానీ అతడి స్వరూపం అందరికీ తెలిసిపోయిందన్నారు.
బావ కళ్లలో ఆనందం కోసమే హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రయత్నిస్తున్నాడని మంత్రి రోజా పేర్కొన్నారు. అసెంబ్లీపైనా, స్పీకర్ పైనా గౌరవం లేకుండా సభలో గందరగోళం సృష్టించారన్నారు. అయినా నిండుసభలో మీసాలు తిప్పటం, తొడలు కొట్టటం ఎంతవరకు సబబో వారే ఆలోచించుకోవాలని అన్నారు. ఈ మీసాలు తిప్పడమేదో కన్నతండ్రి ఎన్టీఆర్ పై చెప్పులు వేయించినప్పుడు తిప్పివుంటే బావుండేదన్నారు. ప్లూటు జింక ముందు ఊదు... సింహంలాంటి జగన్ ముందు కాదు అంటూ బాలయ్య డైలాగ్ లో ఆయనకే హెచ్చరించారు మంత్రి రోజా.
Read More రాజకీయ కక్షతోనే బాబుపై కేసు:క్షమాపణలకు బాలకృష్ణ డిమాండ్
తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకోసం ఈ బాలకృష్ణ ఏనాడైనా పోరాటం చేసాడా? అని రోజా ప్రశ్నించారు. ఇప్పుడు అవినీతికి పాల్పడి జైల్లో పడ్డ బావకోసం మాత్రం బాలకృష్ణ సినిమాలు వదిలి వచ్చాడన్నారు. చంద్రబాబు తప్పు చేయలేదని నమ్మిచే న్యాయస్థానాలే వదిలిపెడతాయి కదా... అందుకోసం అసెంబ్లీ సమయాన్ని వృదాచేయడం ఎందుకని రోజా అన్నారు.
అధికారం చేతిలో వుందికదా అని చంద్రబాబు ప్రజాధనాన్ని దోచుకున్నారని... ఇలా ఎవరు చేసినా వదిలే ప్రసక్తే లేదని రోజా హెచ్చరించారు. అవినీతిపరులను అరెస్ట్ చేస్తే టిడిపి సభ్యులు అసెంబ్లీలో రౌడీయిజం చేస్తున్నారు... దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. మీరు కేవలం 23 మందే వున్నారు... మేము 151 మంది వున్నాం.. మేము కూడా మీలాగే వ్యవహరిస్తే ఎలా ఉంటుంది అంటూ టిడిపి నాయకులకు రోజా హెచ్చరించారు.