జైల్లో వున్న ఖైదీతో పవన్ పొత్తు పెట్టుకున్నారని చురకలంటించారు మంత్రి రోజా . స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారని, ఆయనకు మద్ధతిచ్చే వారందరికీ ఇందులో వాటాలు అంది వుంటాయని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఏపీ ఎన్నికల్లో టీడీపీ ,జనసేన కలిసి నడుస్తాయంటూ పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. దీనిపై వైసీపీ నేతలు, మంత్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి రోజా మాట్లాడుతూ.. జైల్లో వున్న ఖైదీతో పవన్ పొత్తు పెట్టుకున్నారని చురకలంటించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారని, ఆయనకు మద్ధతిచ్చే వారందరికీ ఇందులో వాటాలు అంది వుంటాయని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ప్యాకేజ్ కోసమే ప్రయత్నిస్తున్నారని.. స్కిల్ స్కాంలో ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు లేవని చెబుతున్నారని, కానీ సంతకాలు వున్నట్లుగా సీఐడీ చెప్పిందని రోజా వెల్లడించారు. మరి ఈ విషయం పవన్‌కు తెలియదా అని మంత్రి ప్రశ్నించారు .
అంతకుముందు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు ఇన్నాళ్లూ విడివిడిగా ఉన్నట్టుగా నటించారని విమర్శించారు. రాజకీయాల్లో చంద్రబాబుకు పవన్ డూప్ అని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ చంద్రబాబు కోసం పనిచేశారని.. 2019లో చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేలా చూశారని విమర్శించారు. బీజేపీని తీసుకొచ్చే బాధ్యతను పవన్‌కు చంద్రబాబు అప్పగించారేమోనని అన్నారు. పవన్ ఎప్పుడూ ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేదని.. ఆయన అభిమానులే తీవ్ర నిరాశలో ఉన్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన వైసీపీ సిద్దంగా ఉందని వెల్లడించారు.
Also Read: రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయి.. పవన్ ప్రకటన
ఏపీలో అధికార పార్టీకి పాజిటివ్ ఓటు ఉందని చెప్పారు. ఏ సర్వేలోనైనా 70 శాతం మంది ప్రజలు జగన్ వైపే చూస్తున్నారని స్పష్టం అవుతుందని అన్నారు. ఇంకా ఏదైనా కారణాలతో కొంత ఓట్లు తగ్గినప్పటికీ.. తమకు 50 శాతం కంటే ఎక్కువే ఓటు బ్యాంకు ఉంటుందని.. ఎన్నిశక్తులు ఏకమైనా తమకు కలిగే నష్టమేమి లేదని చెప్పారు. నాలుగున్నరేళ్లుగా జగన్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేశారని.. అదే తమ ధీమా అని చెప్పారు. తాము ప్రజలకు చేయాల్సినవి చేశామని తెలిపారు. అటువైపు ఉన్న వ్యక్తులు ప్రజలకు చేసిందేమి లేదని.. వారు ఎంతసేపు మేకపోతు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
