Asianet News TeluguAsianet News Telugu

స్క్రిప్ట్ రాసిచ్చినా మాట్లాడలేడు..చప్పట్లు కొట్టడానికే డైలాగ్స్ : బాలకృష్ణకు రోజా కౌంటర్

సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కౌంటరిచ్చారు మంత్రి రోజా. సినిమాల్లో ఎన్ని డైలాగ్స్ కొట్టినా చప్పట్లు కొట్టడానికే పనికొస్తాయని.. ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్పించి జీవోలు చదవడం రాదా అని ఆమె బాలయ్యను ప్రశ్నించారు . 

minister rk roja counter to tdp mla nandamuri balakrishna
Author
First Published Jan 15, 2023, 2:35 PM IST

సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై విమర్శలు గుప్పించారు మంత్రి రోజా. జీవో నెంబర్ 1 గురించి పూర్తిగా చదివితేనే అర్ధమవుతుందన్నారు. ఆయన రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్ధితులు వున్నాయని అనడం సిగ్గు చేటని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు భ్రమ నుంచి బాలకృష్ణ బయటకు రావాలని , ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్పించి జీవోలు చదవడం రాదా అని ఆమె ప్రశ్నించారు . రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల బాగోగులు తెలిసిన వ్యక్తి అని.. అది ఎందుకు తీసుకొచ్చామో తెలుసుకుంటే ఎమర్జెన్సీ అనే కామెంట్‌ను బాలయ్య వెనక్కి తీసుకుంటారని రోజా ఆకాంక్షించారు. సినిమాల్లో ఎన్ని డైలాగ్స్ కొట్టినా చప్పట్లు కొట్టడానికే పనికొస్తాయని ఆమె అన్నారు. 

బాలయ్య బాబు పరిస్థితి స్క్రిప్ట్‌లు రాసిచ్చినా మాట్లాడలేని పరిస్ధితి అని రోజా చురకలంటించారు. చంద్రబాబు సభల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయినా బాలయ్య ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్టీఆర్‌కు చేసిన మోసాన్ని కప్పిపుచ్చేలా షో నడిపించారని, ఎవరు చచ్చినా పర్వాలేదని.. తన బావ మీటింగ్ మాత్రం జరగాలని బాలకృష్ణ భావిస్తున్నారని రోజా దుయ్యబట్టారు. అంతకుముందు ఆదివారం అన్నమయ్య జిల్లా శెట్టిపల్లిలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మంత్రి రోజా పాల్గొన్నారు. తాను ప్రతి ఏటా ఇక్కడే సంక్రాంతిని జరుపుకుంటానని.. జగన్ పాలనలో రైతులు సుభిక్షంగా వుంటారని అన్నారు. 

Also REad: జగన్‌ని టార్గెట్ చేసేలా ‘‘వీరసింహారెడ్డి’’ డైలాగ్స్ .. అవి ప్రజల అభిప్రాయాలే : బాలయ్య సంచలన వ్యాఖ్యలు

ఇదిలావుండగా.. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన'వీరసింహా రెడ్డి' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించగా, మరో ముఖ్యమైన పాత్రలో హనీరోజ్ అలరించింది. ఇక విలన్ షేడ్స్ కలిగిన భానుమతి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించగా, ఐటమ్ నెంబర్ లో చంద్రిక రవి మెరిసింది. మొత్తానికి ఈ సినిమా ఓపినింగ్స్ బాలయ్య కెరీర్‌లో కొత్త రికార్డులకు తెరతీసిందనేది ట్రేడ్ టాక్. కలెక్షన్స్ విషయం ప్రక్కన పెడితే ఈ సినిమా లో పెట్టిన  కొన్ని పొలిటికల్ డైలాగ్స్ గురించి సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బాలయ్య పేల్చిన డైలాగ్స్ థియేటర్‌‌లో ఈలలు వేయించినా.. బయట మాత్రం పెద్ద చర్చకు దారి తీసింది. 

ఈ నేపథ్యంలో వీరసింహారెడ్డిలో పొలిటికల్ డైలాగ్స్‌పై బాలయ్య స్పందించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారాపల్లికి బాలయ్య కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి చంద్రగిరిలో వీరసింహారెడ్డి సినిమా చూశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఈ సినిమాలోని డైలాగ్స్ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లుగా వున్నాయంటూ విలేకరి అడిగిన ప్రశ్నకు బాలయ్య స్పందించారు. సాధారణంగా ప్రజల అభిప్రాయాలే సినిమాల్లో వుంటాయని.. సినిమాలు, ప్రజలు వేరు వేరు కాదని ఆయన అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలుసునని.. ప్రస్తుతం ఎమర్జెన్సీ నాటి పరిస్ధితులు ఆంధ్రప్రదేశ్‌లో వున్నాయని బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ద్వారా, పరిస్థితులను తెలియజేశామని ఆయన పేర్కొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios