Asianet News TeluguAsianet News Telugu

ఆ విషయంలో చంద్రబాబుది సైంధవ పాత్ర: మంత్రి రంగనాథరాజు ధ్వజం

ఇళ్లపట్టాల పంపిణీలో చంద్రబాబుది సైంధవ పాత్ర వహిస్తున్నారని ఏపీ గృహనిర్మాణ శాఖమంత్రి చెరుకువాడ రంగనాథ రాజు మండిపడ్డారు. 

minister ranganatha raju serious on tdp chief chandrababu naidu
Author
Amaravathi, First Published Jul 7, 2020, 11:30 AM IST

అమరావతి: ఇళ్లపట్టాల పంపిణీలో చంద్రబాబుది సైంధవ పాత్ర వహిస్తున్నారని ఏపీ గృహనిర్మాణ శాఖమంత్రి చెరుకువాడ రంగనాథ రాజు మండిపడ్డారు. పంపిణీకి 60వేల ఎకరాలు సిద్ధం చేశామని... అయితే ఈ పట్టాల పంపిణీని అడ్డుకోవాలని చూస్తూ 30 లక్షల మంది పేద కుటుంబాలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

''రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తామని మా పార్టీ అధ్యక్షులు జగన్‌ ఎన్నికలకు ముందు వాగ్దానం చేయటం జరిగింది. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు మొదటి ఏడాదిలోనే ఒక ఉద్యమంలా ఇందుకు సంబంధించి భూసేకరణను చేయటం జరిగింది. అటు ప్రభుత్వ భూముల్ని... ఇటు ప్రైవేటు భూముల్ని కూడా ఇందుకు ఉపయోగించుకున్నాం. తద్వారా ముందుగా అనుకున్నట్లు 25 లక్షలు మాత్రమే కాదు మరో 5 లక్షల ఇళ్ళ పట్టాలు... మొత్తంగా 30లక్షలకు పైగా ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు జగన్‌ నేతృత్వంలో ఒక భారీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది'' అని వివరించారు. 

''అయితే దేవతలు యజ్ఞం చేస్తుంటే.. రాక్షసులు భగ్నం చేసే ప్రయత్నం చేస్తారన్న పద్ధతిలో చంద్రబాబు నాయుడు, ఆయన మనుషులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. అయినా వారి ఆటలు సాగవని తెలియజేస్తున్నాం. పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారు చరిత్ర హీనులు కాక తప్పదని స్పష్టం చేస్తున్నాం'' అని హెచ్చరించారు. 

read more  ఇంకెంత దిగజారుతావు గుడ్డి విజనరీ...: చంద్రబాబుపై విజయసాయి సంచలనం

''నిజానికి ఈ నెల 8వ తేధీన అంటే మహానేత 71వ జయంతి రోజున 30 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా ప్రభుత్వ, ప్రైవేటు భూములు కలిపి 60వేల ఎకరాల సేకరణ ద్వారా అడుగు వేశాం. ఇళ్ళ స్థలాలు రెడీగా ఉన్నాయి. ఇవ్వటానికి ప్రభుత్వం కూడా రెడీగా ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు, ఆయన అనుయాయులు ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు హైకోర్టుకు వెళ్ళారు. కొన్ని వందల రిట్‌ పిటిషన్లు దాఖలు చేయించారు.  అందులో ప్రధానంగా నాలుగు రిట్‌ పిటీషన్లుకు సంబంధించి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారం ఇళ్ళ పట్టాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేసేందుకు, రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాలిచ్చేందుకు వీలుగాని పరిస్థితి ఏర్పడింది'' అని అన్నారు. 

''దీన్ని మేం సుప్రీంకోర్టులో సవాల్‌ చేశాం. ఈ కోవిడ్‌ సమయంలో సుప్రీంకోర్టుకు కూడా సెలవులు ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఆ స్టేలను తొలగించే  పరిస్థితి లేదు కాబట్టి అందుకు కొద్ది సమయం పడుతుంది. అవరోధాలన్నీ తొలగి ఆగస్టు 15 నాటికి రిజిస్ట్రేషన్‌ చేసి అక్కచెల్లెమ్మల చేతుల్లో ఈ 30 లక్షల ఇళ్ళ పట్టాలను వారికి ఇచ్చిన స్థలంలోనే వారికి అందజేస్తాం'' అని స్పష్టం చేశారు. 

''ప్రభుత్వ నిర్ణయంలో ఒక వజ్ర సంకల్పం ఉంది. అదే సమయంలో మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా అందరూ గమనించాలి. దీనికి అడ్డుపడుతున్నది ఎవరు..? ఎందుకు కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది..? పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి చంద్రబాబు ఎందుకు అడ్డుపడుతున్నాడు? తన హయాంలో 2 లక్షల ఇళ్ళు కూడా కట్టించలేకపోయానన్న అవమానంతోనేనా..? లేక ఈ ప్రభుత్వ 30 లక్షల ఇళ్ళ పట్టాలు ఒకేసారి ఇస్తే ఇక తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయంతోనా?''  ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. 

''మరోవంక ఈరోజు చంద్రబాబు నాయుడు చాలా విచిత్రమైన వాదన చేశారు. తన హయాంలో లక్షల ఇళ్ళు కట్టేశానంటున్నారు. ఎక్కడ కట్టారో ఆయనకే తెలియాలి..? నిజానికి వైయస్‌ఆర్‌ హయాంలో కేవలం 5 ఏళ్ళ కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో 48 లక్షల ఇళ్ళ నిర్మాణం జరిగింది. అందులో దాదాపు 60 శాతం ఇళ్ళు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ లోని 13 జిల్లాల్లో కట్టినవే. కానీ చంద్రబాబు 5 ఏళ్ళ హయాంలో మొదటి రెండేళ్ళలో ఇళ్ళ నిర్మాణం ఆపేశారు. ఆ తర్వాత మూడేళ్ళలో 2 లక్షల ఇళ్ళ నిర్మాణం కూడా జరిగింది లేదు'' అని వివరించారు.

''ఇక టిడ్కో అంశానికి వద్దాం. టిడ్కో ఇళ్ళ నిర్మాణం పూర్తికాలేదు కానీ, పునాది పడక ముందే మీ ఫ్లాట్‌ ఫలానా చోట ఉంటుందంటూ.. నేల మీద నిలబెట్టి గృహ ప్రవేశాలు చేయించేశారు.  చంద్రబాబు నాయుడు కట్టిన ఇళ్ళు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదుగానీ, ఆయన పెట్టిన టిడ్కో బకాయిలు రూ. 3 వేల కోట్లు, హౌసింగ్‌ కు సంబంధించి ఇతర బకాయిలు మరో రూ. 1300 కోట్లు మొత్తంగా రూ. 4,300 కోట్లు బాకీ పెట్టి దిగిపోయాడు. ఇవన్నీ నిజాలు కాదా..?ఈ డబ్బు అంతా ఎవరు కట్టాలి.. చంద్రబాబు ఎందుకు కట్టలేదు..? '' అని నిలదీశారు. 

''ఇంతటి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా, ఈ కోవిడ్‌ సమయంలో కూడా పేదల గృహ నిర్మాణానికి సంబంధించి జగన్‌ తన మాటకు కట్టుబడ్డారు. ఇంత కష్టకాలంలో  కూడా 25 లక్షల ఇళ్ళ స్థలాలు కాదుఏకంగా 30 లక్షల ఇళ్ళ స్థలాలు సిద్ధం చేశారు.  ఇదీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ఆగస్టు 15 నాటికి రిజిస్ట్రేషన్లు చేసి ఇళ్ళ స్థలాల్ని.. ఈ 30 లక్షల మంది అక్కాచెల్లెమ్మల చేతుల్లో పట్టాలు పెడతాం'' అని  మంత్రి  రంగనాథ రాజు స్పష్టం చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios