భర్తను కోల్పోయి పుట్టెడు ధు:ఖంలో వున్న నిరుపేద మహిళను పోస్టుమార్టం కోసం లంచం డిమాండ్ చేసిన ఉదయగిరి ప్రభుత్వాస్పత్రి డాక్టర్ ను సస్పెండ్ చేసినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని తెలిపారు. 

నెల్లూరు: అసలే కట్టుకున్నవాడు ఆత్మహత్య చేసుకోవడంతో పుట్టెడు దు:ఖంలో వున్న మహిళను లంచం కోసం వేధించాడు ఓ కసాయి డాక్టర్. పోస్టుమార్టం చేసి భర్త మృతదేహాన్ని అప్పగించాలంటే 16వేలు లంచం ఇవ్వాలంటూ నిరుపేద మహిళను డాక్టర్ డిమాండ్ చేసిన ఘటన నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరిలో చోటుచేసుకుంది. డాక్టర్ అయివుండి ఏమాత్రం మానవత్వం లేకుండా వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో దుమారం రేగుతుండటంతో వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని ఉదయగిరి ఘటనపై స్పందించారు. 

''నిరుపేద కుటుంబాన్ని పోస్టుమార్టం కోసం లంచం డిమాండ్ చేసిన ఆమాన‌వీయ ఘటన గురించి నా దృష్టికి రాగానే సదరు డాక్టర్ పై చర్యలకు జిల్లా అధికారులను ఆదేశించాను. దీంతో ఉదయగిరి ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న మెడిక‌ల్ ఆఫీస‌ర్ సంధాని బాషాను వెంటనే స‌స్పెండ్ చేశాం'' అని వైద్యారోగ్య శాఖ మంత్రి తెలిపారు. 

''ఏ ప్రభుత్వ హాస్పిటల్స్ లో వైద్యం కోసమే కాదు పోస్టు మార్టం కోసం కూడా వైద్యులు, ఇతర సిబ్బందికి డబ్బులు ఇవ్వవద్దు. ఎవరయినా డబ్బులు డిమాండ్ చేస్తే వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లండి. ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్యం అందించ‌డం మా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిగారి ల‌క్ష్యం. కాబట్టి వైద్యారోగ్య శాఖ‌లో ఎలాంటి త‌ప్పిదాల‌నూ క్షమించం. అధికారుల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తే ఉపేక్షించం... వెనువెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటున్నాం'' అన్నారు. 

''త‌ల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవ‌లు ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా ఉన్నాయి. ఒక్క ఏప్రిల్ నెల‌లోనే త‌ల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహ‌నాల ద్వారా 18,450 మంది త‌ల్లులు, శిశువుల‌ను వారి గ‌మ్య‌స్థానాల‌కు చేర్చాం. ఇత‌ర రాష్ట్రాలు ఆద‌ర్శంగా తీసుకునేలా త‌ల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహ‌నాలు ప‌నిచేస్తున్నాయి'' అని వైద్య శాఖ మంత్రి విడదల రజని పేర్కొన్నారు. 

ముదిరాజ్ ఆత్మహత్య... 

పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం రాయకుంట గ్రామానికి చెందిన ముదిరాజ్ ఉపాధి నిమిత్తం పెళ్లాం పిల్లలతో కలిసి నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నివాసముంటున్నాడు. అయితే జీతం డబ్బులు సరిపోక అప్పులు చేసేవాడు. దీంతో అప్పులు పెరిగి భారంగా మారాయి. ఇలా ఇప్పటికే తెలిసినచోటల్లా అప్పులు చేయడంతో ఇక అప్పులు పుట్టక... చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలీక ముదిరాజ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీంతో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

అతడి మృతదేహాన్ని గుర్తించిన మహిళ పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని కిందకుదించి పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ముదిరాజక మృతదేహాన్ని పోస్టుమార్టం చేసేందుకు డాక్టర్ చందాని బాషా లంచం డిమాండ్ చేశాడు. తనకి 15వేలు, అటెండర్ కు వెయ్యి రూపాయలు మొత్తంగా 16వేలు ఇస్తేనే శవాన్ని పోస్టుమార్టం చేసి అప్పగిస్తానని... లేదంటే ఇక్కడే మార్చురీలో వుంచుతానని బెదిరించాడు. అంత పెద్దమొత్తంలో లంచం ఇచ్చుకోలేక పాపం మహిళ నరకయాతన అనుభవించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో హైలైట్ కావడంతో సదరు డాక్టర్ పై వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.