ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని అమ్మేసినా టీడీపీ, వైసీపీలు మోడీని ప్రశ్నించలేవని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ పార్టీల పరిస్ధితి విచిత్రంగా వుందన్నారు. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూడా మోడీకే మద్ధతుగా వున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. విశాఖ ఫ్యాక్టరీని అమ్మినా మోడీని అడిగే పరిస్ధితి ఏపీలో లేదని.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల పక్షాన పోరాడే పార్టీ, కేసీఆర్ లాంటి నాయకుడు అవసరమని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఏపీలో కేసీఆర్ నాయకత్వం కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఏపీలో అభివృద్ధిని పక్కనపెట్టి కులాల కొట్లాట జరుగుతోందని ప్రశాంత్ రెడ్డి దుయ్యబట్టారు. గతంలో ఉన్న నాయకుడు ఓ కులాన్ని పెంచుకున్నారని.. ఇప్పుడున్న నాయకులు ఆ కులంపై పడ్డారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఎనిమిదేళ్లుగా ఏపీలో ఏం జరుగుతుందో ఏంటోనంటూ ఆయన వ్యాఖ్యానించారు.
