ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో వారాహి యాత్ర చేపట్టిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై మంత్రి విశ్వరూప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
తిరుమల :ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా తమ అభిమాన హీరో, రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ ను చూడాలని మెగా అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు కోరుకుంటారు. అలాగే పవన్ అంటే అభిమానించే వివిధ రంగాల ప్రముఖులు కోరుకోవడం చూస్తుంటాం. కానీ ప్రత్యర్థి పార్టీ నాయకుడే కాదు స్వయంగా రాష్ట్ర మంత్రి కూడా అయిన పినిపె విశ్వరూప్ తానుకూడా పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నానని అన్నట్లు ఈనాడు పత్రిక పేర్కొంది. ప్రస్తుతం పవన్ కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదంటూనే అందుకోసం ప్రయత్నించాలని మంత్రి సూచించారు. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధిలోనే మంత్రి విశ్వరూప్ ఇలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
మంత్రి విశ్వరూప్ వీఐపి బ్రేక్ సమయంలో తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామివారి ఆలయం బయట మంత్రి పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలోని ఏ పార్టీ నాయకుడికైనా ప్రజలవద్దకు వెళ్లవచ్చు... కానీ ప్రజలు ఎవరిని నమ్ముతారనేదే ముఖ్యమని అన్నారు. పవన్ కల్యాణ్ వారాహియాత్రతో పాటు మరికొందరు ప్రతిపక్ష నాయకులు పాదయాత్రలు, బస్సుయాత్రలు చేస్తున్నారని... ఎవరేం చేసినా ప్రజలు మాత్రం వైసిపి వైపే వున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలన్ని కలిసివచ్చినా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది జగనేనని విశ్వరూప్ స్పష్టం చేసారు.
ఇదే సమయంలో పవన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానులతో పాటు తాను కోరుకుంటున్నానని... కానీ అది జరిగేపని కాదన్నారు మంత్రి విశ్వరూప్. ముఖ్యమంత్రి కావాలంటే పవన్175 స్థానాల్లో జనసేన అభ్యర్ధులను బరిలోకి దింపి కనీసం 88 మందిని గెలిపించుకోవాలని అన్నారు. ఇలాకాకుండా వేరే పార్టీలో పొత్తు పెట్టుకున్నా సగానికిపైగా అంటే 50మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవాల్సి వుంటుందని అన్నారు. ఇదేదీ జరిగే పరిస్థితి ప్రస్తుతం ఏపీలో లేదు కాబట్టి పవన్ సీఎం కావడం సాధ్యంకాదని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు.
Read More ‘‘ హాయ్ ఏపీ.. బైబై బీపీ ’’ కొత్త నినాదం అందుకున్న మంత్రి రోజా .. అర్ధం ఇదే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నారని విశ్వరూప్ అన్నారు. నవరత్నాలతో ఇప్పటికే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. నాలుగేళ్ళ వైసిపి పాలనలో కనీసం ఒక్క కరువు మండలాన్ని కూడా ప్రకటించలేదంటేనే పాలన ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చని మంత్రి అన్నారు.
ఇదిలావుంటే ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రజలవద్దకు వెళుతున్నారు. అధికార వైసిపి గడపగడపకు మన ప్రభుత్వం, మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతోంది. ప్రతిపక్ష టిడిపి అధినేత రాష్ట్రవ్యాప్త పర్యటనలు, లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించచారు. ఇలా అన్నిపార్టీలు ఎన్నికల మూడ్ లో ప్రజల్లోకి వెళుతున్నాయి.
