ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు మంత్రి పేర్ని నాని. గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా కంటే కూడా చంద్రబాబు నైజం ప్రమాదకరమంటూ ఎద్దేవా చేశారు. శక్తికి మించి ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తోందని నాని వెల్లడించారు.

చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్ 440కే వేరియంట్‌ ఏపీదేనని దుష్ప్రచారం చేస్తున్నారని నాని విమర్శించారు. ఏపీలో కొత్త వైరస్ లేదని.. ఈ విషయాన్ని నిపుణులే చెబుతున్నారని మంత్రి పేర్కొన్నారు.

అయినప్పటికీ.. ఏపీలో కొత్త వైరస్ వుందని అబాండాలు వేస్తున్నారని.. చంద్రబాబుకు రాష్ట్రంపై ఎందుకింత పగ అంటూ నాని ధ్వజమెత్తారు. ఎన్ 440కే వైరస్‌పై ఎలాంటి నిర్ధారణా జరగలేదని మంత్రి తెలిపారు. దేశంలో బీ.1.617 మినహా కొత్త రకం వైరస్ ఎక్కడా లేదని నాని వెల్లడించారు.

Also Read:అనంతపురం ఆసుపత్రిలో మరణాలపై రిపోర్ట్ ఇవ్వండి: కరోనాపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

పక్కరాష్ట్రాల్లో దాక్కొని చంద్రబాబు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని పేర్ని నాని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలోనూ చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి ఫైరయ్యారు. అవసరమైన ప్రతి రోగికి రెమిడిసివర్ ఇంజెక్షన్ అందుబాటులో వుందని నాని స్పష్టం చేశారు.

కరోనా నేపథ్యంలో ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకెళ్తున్నామని మంత్రి వెల్లడించారు. చంద్రబాబు మాత్రం విషం చిమ్మే కార్యక్రమం చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. వ్యాక్సిన్ల నియంత్రణ ఎవరి చేతుల్లో వుందో చంద్రబాబుకు తెలియదా అంటూ నిలదీశారు.

ఇప్పటి వరకు రెండు విడతలు కలిపి రాష్ట్రంలోని 67,42,700 మందికి వ్యాక్సిన్ వేశామని పేర్ని నాని వెల్లడించారు.  కేంద్రం సమృద్ధిగా టీకాలు సరఫరా చేస్తే.. రోజకు 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేయగలమని మంత్రి స్పష్టం చేశారు.