చంద్రబాబుకు అధికారం, దోచుకోవడం, దాచుకోవడం అంటే ప్రేమ అంటూ ఎద్దేవా చేశారు మంత్రి పేర్ని నాని. ఆదివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ అధినేతపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఏ వూరి మీద మమకారం, ఎవరిపైనా ప్రేమ వుండదన్నారు. చివరికి మామగారు, బామ్మర్ధులు, తోడల్లుడుపైనా ప్రేమ లేదంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అధికారంలో వచ్చిన జగన్ పాలనలో టీడీపీ నేతల పర్యటనలను కార్యకర్తలు, జనం పట్టించుకోవడం లేదంటూ మంత్రి సెటైర్లు వేశారు.

అమరావతికి ఏం చేశావంటూ స్వయంగా రైతులే ఆయనను నిలదీస్తున్నారని నాని తెలిపారు. అమరావతి పేరుతో విజయవాడ, గుంటూరులను చంద్రబాబు నాశనం చేశారని ఆయన ఆరోపించారు.

అమ్మవారి దగ్గర క్షుద్రపూజలు చేస్తే ఆమె చంద్రబాబును  క్షమిస్తుందా అని నాని ప్రశ్నించారు. వర్షం వస్తే కారిపోయే రెండు బిల్డింగ్‌లను కట్టించారని .. ఇందుకు రూ.3,000 కోట్లు ఖర్చుపెట్టారంటూ మంత్రి దుయ్యబట్టారు.

ఓటుకు నోటు కేసులో దొరికిపోయి.. దొంగలాగా అర్ధరాత్రి పారిపోయి వచ్చారంటూ నాని గుర్తుచేశారు. నాలుగు వూళ్ల నుంచి మట్టి తెచ్చి షో చేశారని సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రిగా వుండి విజయవాడలో ఒక వంతెన పూర్తి చేయలేకపోయారన్నారు.

అమరావతికి ఏమైనా చేసుంటే మంగళగిరి, తాడికొండ, పెదకూరపాడులలో ఎందుకు జనం ఓడించారని నాని ప్రశ్నించారు. జగన్ ఇంటి పన్ను పెంచుతారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కానీ రాష్ట్రంలో నీటి పన్ను పెంచిందెవరని పేర్ని నాని నిలదీశారు. రాబోయే రెండేళ్లకాలంలో రాష్ట్రంలో ఒక్క బ్రాందీ షాపు కూడా కనిపించకుండా చేస్తామన్నారు.