Asianet News TeluguAsianet News Telugu

నిండు గర్భిణీ మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి...

నిండు గర్భిణి అయిన లావణ్యను శుక్రవారం రాత్రి ప్రసవం నిమిత్తం శిరివెళ్ల నుంచి నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆమె బిడ్డను ప్రసవించకుండానే మృతి చెందింది.

pregnant woman died before delivery in kurnool
Author
Hyderabad, First Published Jun 29, 2020, 9:03 AM IST

నిండు గర్భిణీ... మరి కొద్ది రోజుల్లో బిడ్డ పుడతాడని కుటుంబంలోని వారంతా ఎంతో సంబరపడ్డారు. కానీ... ఆశలన్నీ అడయాశలయ్యాయి. బిడ్డ కడుపులో ఉండగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. బిడ్డ గర్భంలో ఉండగా చనిపోయిందని.. అంత్యక్రియలకు కూడా గ్రామస్థులు అంగీకరించలేదు. దీంతో.. కుటుంబసభ్యులు.. ఆమె మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి వచ్చారు. ఈ దారుణ సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం బి.నాగిరెడ్డిపల్లెకు చెందిన ధర్మేంద్ర అనే వ్యక్తితో శిరివెళ్లకు చెందిన లావణ్య (20)కు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. నిండు గర్భిణి అయిన లావణ్యను శుక్రవారం రాత్రి ప్రసవం నిమిత్తం శిరివెళ్ల నుంచి నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆమె బిడ్డను ప్రసవించకుండానే మృతి చెందింది.

మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా.. అంత్యక్రియలకు గ్రామస్థులు అంగీకరించలేదు. గర్భంలో శిశువు ఉండగా అంత్యక్రియలు చేస్తే అరిష్టమంటూ అడ్డుపడ్డారు. చేసేది లేక కుటుంబ సభ్యులు అర్ధరాత్రి వేళ ఆ మృతదేహాన్ని ఓ వాహనంలో నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అప్పనపల్లె సమీపంలోని పులిబోను వాగు ప్రాంతంలో ఓ చెట్టు మొదలు వద్ద మృతదేహాన్ని కూర్చోబెట్టి.. తాళ్లతో కట్టేసి వచ్చారు.

స్థానికులు పనులకు వెళ్తూ ఆమె మృతదేహాన్ని చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామస్థుల మూఢనమ్మకాల కారణంగా.. కనీసం ఆమెకు అంత్యక్రియలు కూడా నిర్వహించలేదు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios