పోలవరం ప్రాజెక్ట్ పనుల నుంచి నవయుగ సంస్థను తప్పించడంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మంత్రి పేర్ని నాని కౌంటరిచ్చారు. అమరావతిలో మీడియాలో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్‌పై పదేళ్ల పాటు ఉన్న హక్కును వదులుకుని అర్ధరాత్రి మూటముల్లె సర్దుకుని తండ్రికొడుకులిద్దరూ బెజవాడ వచ్చారని పేర్ని సెటైర్లు వేశారు.

కేసుల్లోంచి తప్పుకోవడానికి తప్పించి.. రాష్ట్ర ప్రజలపై ప్రేమతో వారిద్దరూ రాలేదని ఆయన ధ్వజమెత్తారు. పదవి పోయినా మదం మాత్రం దిగలేదని, జనం ఛీకొట్టినా గ్రాము కొవ్వు కూడా దిగేలదని మాజీ మంత్రి దేవినేనిపై నాని ఫైరయ్యారు.

ముఖ్యమంత్రిని పేరు పెట్టి సంభోదిస్తున్నారని.. తలచుకుంటే తాము కూడా అనగలమంటూ మండిపడ్డారు. జీవోలను ఎలా ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చో కూడా తెలియని వాళ్లు మంత్రులవ్వడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని నాని విమర్శించారు.

ప్రజల ఆస్తుల్ని, ఆకాంక్షల్ని వేరొకరికి తాకట్టు పెట్టడానికి ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదన్నారు. ఆరునూరైనా మచిలీపట్నం పోర్ట్ పూర్తి చేస్తామన్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అమెరికాలో నెలన్నరపాటు జల్సాలు చేసొచ్చారని ఇవాళ అసత్యాలు మాట్లాడుతున్నారని నాని మండిపడ్డారు.

రెండు జేసీబీలు, రెండు ప్రొక్లయిన్‌లతో పోర్ట్ నిర్మాణం జరుగుతుందా అంటూ చంద్రబాబుపై నాని సెటైర్లు వేశారు. బందరు పనులు ఎక్కడ ఆగిపోయాయో ఉమ, కొల్లు రవీంద్ర చూపిస్తానంటే తాను అక్కడికి వస్తానని నాని సవాల్ విసిరారు.