అమరావతి: పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైసిపి ప్రభుత్వం మరో కీలక బాధ్యత అప్పగించింది. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సభ్యుడిగా మంత్రి పెద్దిరెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. సదరన్ జోనల్ కౌన్సిల్‌కు ఏపీ సభ్యుడిగా ఆయనను నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైసిపి సర్కార్.  

ఇప్పటికే 29వ దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సదస్సు ఈఏడాది మార్చి4వ తేదీన తిరుపతిలో జరగనున్నట్లు ప్రకటించారు.  ఈ సదరన్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణా, కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు పాల్గోనుండగా కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీప్ లు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గోనున్నాయి. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెప్టనెంట్ గవర్నర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు,ఆయా రాష్ట్రాల ప్రభుత్వ సలహాదారులు, ఇతర ముఖ్య అధికారులు ఈ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. సుమారు 90 నుండి 100 మంది వరకూ ప్రముఖులు, అధికారులు పాల్గొనే అవకాశం ఉంది. 

ఈ సదరన్ కౌన్సిల్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆతిధ్యం ఇవ్వనున్న నేపధ్యంలో సమావేశం నిర్వహణకు సంబంధించి ముఖ్యంగా అతిధులకు ఆహ్వానం, రవాణా, వసతి, బందోబస్తు వంటి ఏర్పాట్లన్నీ పటిష్టవంతంగా నిర్వహించాల్సి ఉంది.ఈ నేపధ్యంలో సదరన్ కౌన్సిల్ సమావేశం విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై గత సోమవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఆదిత్యానాధ్ దాస్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. 

ముఖ్యంగా మార్చి 4వతేదీన తిరుపతిలో జరిగే ఈసదరన్ కౌన్సిల్ సమావేశం ప్రాంతాన్ని వెంటనే ఖరారు చేసి హాజరుకానున్న అతిధులందరికీ తగిన వసతి ఏర్పాట్లకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రొటోకాల్ విభాగం అధికారులతో పాటు చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పి, తిరుపతి మున్సిపల్ కమీషనర్, తిరుపతి అర్బన్ ఎస్పిలను సిఎస్ ఆదేశించారు. అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వామివారి దర్శనానికి వచ్చే అతిధులకు తగిన దర్శన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అదే విధంగా ఈసదరన్ కౌన్సిల్ సమావేశం జరిగే తిరుపతి నగరంలోని ప్రధాన వేదిక హాల్లో ప్రత్యేక బ్యాక్ డ్రాప్ ఏర్పాటు, ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేక ప్లెక్సీ బ్యానర్లు ఏర్పాట్లు, వేదిక సుందరీకరణతో పాటు నగర సుందరీకరణ వంటి చర్యల తీసుకోవాలని ప్రొటోకాల్, మున్సిపల్ తదితర శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు.