Asianet News TeluguAsianet News Telugu

తిరుపతిలో వైసిపికి ఆరులక్షల మెజారిటీ... ఆ పార్టీ పోటీ నోటాతోనే: మంత్రి పెద్దిరెడ్డి

తిరుపతి ఉప ఎన్నికను సీఎం జగన్ పాలనపై రెఫరెండంగా తీసుకుందామని మేం చేసిన సవాల్‌ కు చంద్రబాబు తోకముడిచి పారిపోయారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

minister peddireddy ramachandrareddy confident on tirupati ycp victory
Author
Tirupati, First Published Apr 15, 2021, 4:06 PM IST

తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం ఓటమి చాలా స్పష్టంగా కనిపిస్తోందని... ఓటమి భయంతో చంద్రబాబు పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి ఉప ఎన్నికను సీఎం జగన్ పాలనపై రెఫరెండంగా తీసుకుందామని మేం చేసిన సవాల్‌ కు చంద్రబాబు తోకముడిచి పారిపోయారన్నారు. ఒక జాతీయ పార్టీగా వున్న బిజెపి నోటా కన్నా ఎక్కువ ఓట్లు వస్తే చాలు అని తంటాలు పడుతోందని అన్నారు.  

 తిరుపతిలోని పిఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌ లో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ... తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి గెలిస్తే వైసిపి ఎంపీలు రాజీనామా చేస్తారు... మా అభ్యర్థి గెలిస్తే టిడిపి ఎంపీలతో రాజీనామా చేయిస్తావా? అన్న ప్రశ్నకు చంద్రబాబు ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదన్నారు. ఈ రోజుతో ఎన్నికల ప్రచారం కూడా పూర్తవుతోందని.... ఇప్పటి వరకు మేం చేసిన సవాల్‌ను స్వీకరించే దమ్మూ,  ధైర్యం చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. అంటే ఓటమిని అంగీకరిస్తున్నాడనేగా అర్థం అని అన్నారు. 

''నా సవాల్‌కు జవాబు చెప్పకుండా తనపై రాళ్ళ వర్షం అంటూ చంద్రబాబు, అలిపిరి లో ప్రమాణం పేరుతో లోకేష్‌లు డ్రామాలు ఆడుతున్నారు. కనీసం తనపై నాలుగు రాళ్ళు వేయించుకుంటే అయినా.. సానుభూతితో నాలుగు ఓట్లు పడతాయని చంద్రబాబు హైడ్రామా సృష్టించాడు'' అని మంత్రి ఎద్దేవా చేశారు.

''చంద్రబాబు తనపై రాళ్ళవర్షం అన్నాడు. సిసి కెమేరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఎవరూ రాయి విసరలేదని నిర్ధారణ అయ్యింది. తనపై రాళ్ళు వేశారని చెప్పుకుని, సానుభూతి పొంది, నాలుగు ఓట్లు వేయించుకునే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయాడు. అధికారపార్టీ దౌర్జన్యం చేస్తోందనే తప్పుడు ప్రచారం చేసేందుకే ఇటువంటి డ్రామాలు చంద్రబాబు ఆడుతున్నారు'' అని ఆరోపించారు.

read more   మరోసారి మానవత్వాన్ని చాటుకున్న తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి

''చంద్రబాబు డ్రామాలకు ప్రజలు మోసపోయే రోజులు పోయాయి. మేం ఓట్లు అడిగేందుకు చాలా ధైర్యంగా వున్నాము. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా అద్భుతమైన పాలనను అందిస్తున్న జగన్ కే తిరుపతి ఓటర్లు అండగా నిలుస్తారు. ఎక్కడకు వెళ్ళినా మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని, సంక్షేమాన్ని ప్రజలుకు వివరిస్తున్నాం. కుట్రలు, వెన్నుపోటు రాజకీయాలు, రాళ్ళవర్షం డ్రామాలు, అలిపిరి ప్రమాణాల నాటకాలతో ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తావు చంద్రబాబూ?'' అని ప్రశ్నించారు.

''టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీ పార్టీ గురించి, మీ కొడుకు లోకేష్ గురించి ఏం మాట్లాడారో రాష్ట్ర ప్రజలు చూశారు. చంద్రబాబు, లోకేష్ ల వల్లే పార్టీ మొత్తం నాశనమైందని టిడిపి కార్యకర్తలే ఆవేదనతో వున్నారు. రేపో, మాపో పార్టీ మూసేసే పరిస్థితి వుంది. పార్టీనే కాపాడుకోలేని మీరు, తిరుపతి ప్రజలకు టిడిపి అభ్యర్థికి ఓటు వేయమని ఎలా అడుగుతావు చంద్రబాబూ? ఓట్లు అడిగే అర్హత, హక్కు చంద్రబాబుకు లేదు'' అన్నారు. 

''చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాల పాలన కంటే జగన్ ఇరవై రెండు నెలల పాలన ప్రజల్లో మంచి ఆదరణను తీసుకువచ్చింది. ఓట్లరు కూడా వైయస్‌ఆర్‌సిపికి అనుకూలంగా వున్నారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, సేవలను చూసి వైసిపికి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్దంగా వున్నారు. మా పార్టీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా వున్నారు'' అని దీమా వ్యక్తం చేశారు. 

''తిరుపతి పార్లమెంట్ పరిధిలో దొంగ ఓట్లు అంటూ మరో కొత్త ఎత్తుగడను చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా ప్రచారంలోకి తీసుకువచ్చాడు. ఎక్కడా దొంగ ఓట్లు లేవు, అటువంటివి జరిగితే మేం బాధ్యత వహిస్తాం, గాలి వార్తలు ప్రచారం చేసేవారు, ఆ వార్తలను పోగేసి ఓ వర్గం మీడియాలో వండి వార్చేవారు చర్యలకు సిద్ధమా?'' అని అడిగారు.

''తిరుపతి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగితే మాకు దాదాపు ఆరు లక్షలకు పైగా మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నాము. చంద్రబాబు తన పర్యటనలో కరెంటు తీసేశారని, రాళ్ళదాడి చేశారంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడు. అటువంటివి చంద్రబాబుకే అలవాటు. ఆయనలా వెన్నుపోటు రాజకీయాలు మేం చేయలేము. ఆయన చేసే తప్పుడు ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వైయస్‌ఆర్సిపి  దౌర్జన్యం చేస్తోందని అబద్దాలు ప్రచారం చేసుకుని లబ్ధిపొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు'' అని మండిపడ్డారు. 

''పారామిలటరీ బలగాలను తీసుకురావాలని చంద్రబాబు అంటున్నాడు. ఆయన మాదిరిగా మా పార్టీ నుంచి గెలిచిన కార్పోరేటర్లు, ఎంపిటిసి, జెడ్పీటిసిలను బలవంతంగా తీసుకుని తన పార్టీ వారికి పదవులు దక్కేలా మేం చేయలేదు. చంద్రబాబులా అనైతిక రాజకీయాలు చేయడం మాకు చేతకాదు. అటువంటి నీచసంస్కృతికి సీఎం జగన్ పూర్తి వ్యతిరేకం. టిడిపి, బిజెపిల తరఫున స్టార్‌ క్యాంపెయినర్లు ఎంతమంది వచ్చి ప్రచారం చేసినా.. మాకు కేవలం సీఎం జగన్ బొమ్మ చాలు ప్రజల నుంచి ఆదరణ రావడానికి. ప్రజలు మా పక్షాన వున్నారనేది మా విశ్వాసం. అందుకే గతం కంటే మంచి మెజార్టీ సాధిస్తాం'' అని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios