టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బీసీ మంత్రులను డమ్మీలుగా మార్చిన ఘనత చంద్రబాబుదేనంటూ ఆయన దుయ్యబట్టారు. అన్ని కులాల వారికి పదవులు దక్కడం ఏపీలోనే చూస్తున్నామని మంత్రి అన్నారు. 

వైసీపీ సామాజిక న్యాయభేరి (samajika nyaya bhari) బస్సు యాత్ర (ysrcp ministers bus yatra) రాయలసీమలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy) మాట్లాడారు. జగన్ (ys jagan) సీఎం అయ్యాక రాష్ట్రంలో సామాజిక విప్లవం వచ్చిందని వ్యాఖ్యానించారు. అన్ని కులాల వారికి పదవులు దక్కడం ఏపీలోనే చూస్తున్నామని రామచంద్రారెడ్డి అన్నారు. తమ బస్సు యాత్రకు విశేష రీతిలో జనాలు నీరాజనాలు పడుతున్నారని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. 

తాము బస్సు యాత్రను టీడీపీ మహానాడుకు (tdp mahanadu) పోటీగా చేపట్టలేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నీచరాజకీయాలకి స్వస్తిచెప్పాలని హితవు పలికారు. బీసీ మంత్రులను డమ్మీలుగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని (chandrababu naidu) పెద్దిరెడ్డి విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీ ఏంచేసిందో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో ఇంటికి పంపారని, ఆయన చెప్పే మాయమాటలను ఎవరూ నమ్మబోరని ఎద్దేవా చేశారు. 

అంతకుముందు నంద్యాలలో జరిగిన సభలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ... మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగనేనని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు తన పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. ప్రతి పదవుల్లోనూ 50శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్న ఆయనకు ప్రతి ఒక్కరు అండగా ఉండాలని మంత్రి ప్రజలకు సూచించారు. 

వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ ఒకపక్క బడుగు, బలహీనవర్గాలను రాజ్యాధికారం వైపు నడిపిస్తూ... మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వారికి ఆర్థిక స్వావలంభన కల్పిస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. ఒకపక్క కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయినా ఎక్కడా సంక్షేమ పథకాలు అమలు నిలిచి పోకుండా క్యాలెండర్‌ ప్రకారమే అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందన్నారు. 

చంద్రబాబు నాయుడు టీడీపీ మహానాడు పేరుతో కొందరు జోకర్లు, బ్రోకర్లను పక్కన పెట్టుకొని ప్రభుత్వాన్ని తిట్టించే ప్రయత్నం చేశారని ఉపముఖ్యమంత్రి అన్నారు. బీసీలు తమ పార్టీకి పేటెంట్‌ అని చెప్పుకునే చంద్రబాబు 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి వారి అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. కేవలం బిసీలను ఓటుబ్యాంకు రాజకీయాలకు వాడుకుని గద్దెనెక్కారని అన్నారు.. అంతేకాకుండా మైనార్టీలను చిన్నచూపు చూశారని... అందుకే తన ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు, ఎస్టీలకు క్యాబినెట్ లో అవకాశం ఇవ్వలేదని డిప్యూటీ సీఎం ఆరోపించారు.