అమరావతి: ఇసుక అక్రమ రవాణా, బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూతన ఇసుక పాలసీ పేరుతో ఎపిఎండిసి ద్వారా ఇసుక విక్రయాలు ప్రారంభించిందన్నారు రాష్ట్ర భూగర్భగనులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ నేపథ్యంలో కొత్త ఇసుక విధానం వల్ల ఎదురైన సమస్యలను, ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రయత్నం చేశామని తెలిపారు. దానిలో భాగంగా మెరుగైన ఇసుక విధానం కోసం సీఎం జగన్‌ మంత్రులతో సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారని... ఈ కమిటీ పలుసార్లు సమావేశమై, మరింత పారదర్శకంగా, వినియోగదారులకు సులభంగా ఇసుకను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి ప్రభుత్వానికి నివేదికను సమర్పించిందని మంత్రి తెలిపారు. 

''మంత్రుల కమిటీ నివేదికలోని అంశాలను ప్రభుత్వం ప్రజల ముందు పెట్టింది. ప్రజల సూచనలు, సలహాలను ఆహ్వానించింది. ప్రజల నుంచి వచ్చిన స్పందనను పరిశీలించి, మెరుగైన ఇసుక విధానంలో పలు మార్పులు కూడా చేసింది. అవినీతి నిర్మూలన, పారదర్శకత, పర్యావరణ పరిరక్షణ, ఇసుక కొరత లేకుండా, సరసమైన ధరలు లక్ష్యంగా ఇసుక విధానంలో మార్పులు తీసుకువచ్చాం. కాంట్రాక్టరు ఎంపిక కోసం చరిత్రలో ఎన్నడూలేని విధంగా అత్యంత పారదర్శక విధానం అనుసరించాం. కాంట్రాక్టర్‌ను గుర్తించే పనిని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టిసికి అప్పగించాం'' అని గుర్తుచేశారు.

'' నైపుణ్యం, సమర్థత, సాంకేతికత, అనుభవం ఉన్న సంస్థలు మాత్రమే పాల్గొనేలా ఇసుక టెండర్లకు బిడ్‌ సెక్యూరిటీగా రూ.120 కోట్లుగా నిర్ణయించాం. బిడ్ల దాఖలులో ఎటువంటి పక్షపాతానికి తావునివ్వకుండా ఆన్‌ లైన్‌ పద్ధతిలో టెండర్లు జరిగాయి. జేపీ గ్రూపునకు చెందిన జయ్‌ప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ సంస్థను ఎంఎస్‌టిసి ఎంపిక చేసింది. గత ఏడాది ఎపిఎండిసి ద్వారా జరిగిన తవ్వకాలు సుమారు 1.6  కోట్ల మెట్రిక్‌ టన్నులు. ప్రస్తుత ఇసుక విధానం ద్వారా ఏడాదిలో 2 కోట్ల మెట్రిక్‌ టన్నుల సరఫరాను లక్ష్యంగా నిర్దేశించాం'' అని తెలిపారు. 

read more   స్టీల్ ప్లాంట్ రగడ: చంద్రబాబుపై దుష్ప్రచారమే, వైసీపీ బండారాన్ని బయటపెట్టిన కేంద్రం

''వినియోగదారుడే నేరుగా రీచ్‌ల వద్దకు వెళ్లి, నాణ్యతను స్వయంగా పరిశీలించి ఇసుకను కొనుక్కోవచ్చు. తనకు నచ్చిన వాహనాన్ని తీసుకెళ్లి ఇసుక తెచ్చుకోవచ్చు. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. వినియోగదారుడికి వాహనం అందుబాటులో లేకపోతే రీచ్‌లవద్దే కాంట్రాక్టు సంస్థ స్టాండ్‌ బైగా వాహనాలను అందుబాటులో పెట్టాం. రీచ్‌ వద్ద మెట్రిక్‌ టన్నుకు రూ.475 చొప్పున ఎంత కావాలంటే అంత ఇసుకను తెచ్చుకోవచ్చు. ఎన్ని లారీలు కావాలంటే అన్ని లారీల ఇసుకను తీసుకెళ్లొచ్చు. ఒకవేళ ఇసుక తీసుకెళ్లే వ్యక్తి వ్యాపారి అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా అధిక ధరకు విక్రయించే వీలు లేదు'' అని పేర్కొన్నారు. 

''రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వారీగా రవాణాఖర్చులతో కలిపి ప్రభుత్వం ధర నిర్ణయించింది. అంత కంటే అధిక ధరకు ఎవరైనా విక్రయిస్తే వెంటనే, టోల్‌ఫ్రీ 14500 కాల్‌ సెంటర్‌కు కాల్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఎస్‌ఇబి, మైనింగ్‌ అధికారులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలు విక్రయించే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. అందుకోసం గతంలోనే ప్రత్యేకంగా చట్టాలు కూడా చేసింది'' అన్నారు. 

''ఇసుక రీచ్‌ వద్ద మెట్రిక్‌ టన్నుకు రూ.475లు చెల్లించగానే అందులో రూ.375లు నేరుగా ప్రజల ఖజానా, ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. ఏడాదికి కాంట్రాక్టు సంస్థకు నిర్ణయించిన ఏడాదికి ఇసుక సరఫరా లక్ష్యం 2 కోట్ల మెట్రిక్‌ టన్నులు. టన్నుకు రూ. 475 చొపున మొత్తం ఏడాదికి జేపీ సంస్థ ఆర్జించే ఆదాయం విలువ రూ.950 కోట్లు. ఇందులో కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సింది రూ.765 కోట్లు. మిగిలిన సొమ్ము నిర్వహణా ఖర్చులు కింద కాంట్రాక్టు సంస్థకు వెళ్తాయి. ఇందులో వేల కోట్ల అవినీతి ఆరోపణలకు ఆస్కారం ఎక్కడ నుంచి వచ్చిందో ఆరోపణలు చేస్తున్న టిడిపి నేతలే చెప్పాలి'' అని ప్రశ్నించారు. 

''నదుల పక్కనే ఉన్న గ్రామాల్లో సొంత అవసరాల కోసం ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను తెచ్చుకునే అవకాశం ఉంటుంది. బలహీన వర్గాల ఇళ్ల  నిర్మాణాలకు, ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలకు, రీచ్‌లకు సమీపంలో నివసించే వారికి రాయితీపై ఇసుక కొనసాగుతుంది. వారికి కూపన్‌ విధానం కొనసాగుతుంది'' అన్నారు. 

''ఇటీవల రాష్ట్రంలో దాదాపు 31 లక్షల నిరుపేద కుటుంబాలకు ఇళ్ళ స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. వారందరికి ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఈ ఏడాది సుమారు 15 లక్షల ఇళ్లు నిర్మించడం జరుగుతోంది. వాటన్నింటికి ఇసుకను ఉచితంగా అందించబోతున్నాం. అంతే కానీ, ఉచితం పేరుతో గతంలో మాదిరిగా వందల కోట్ల దోపిడీ చేసే అవకాశం లేదు. ప్రభుత్వానికి, ప్రజలకు మంచి జరిగేలా కొత్త విధానాన్ని రూపొందించాం'' అన్నారు మంత్రి పెద్దిరెడ్డి.