విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్రమోడీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాయలేదని వైసీపీ నేతలు చేస్తోంది దుష్ర్పచారం అని తేలిపోయింది.

ఆర్టీఐ సమాచారం ద్వారా ఈ విషయం బహిర్గతమైంది. ఆర్టీఐ దరఖాస్తు PMOIN/R/E/21/00979 నెంబర్‌లో చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాసినట్లు వెల్లడైంది. ఆర్టీఐ కార్యకర్త రవికుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈమేరకు సమాధానం ఇచ్చింది.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 10.3.2021, 20.2.2021 తేదీల్లో ప్రధాని మోడీకి చంద్రబాబు రెండు లేఖలు రాసినట్లు, ఆ లేఖలు నేరుగా పీఎంఓకు అందినట్లు ఆర్టీఐ సమాధానం చెప్పింది.

దీంతో వైసీపీ నేతల పరిస్ధితి కక్కలేక, మింగలేక అన్నట్లుగా తయారైంది. ఆర్టీఐ ఇచ్చిన సమాధానానికి అధికార పార్టీ నేతలు ఏం సమాధానం చెబుతారంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

ఫిబ్రవరి 20న రాసిన లేఖలో విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ అనేది ఉత్తరాంధ్రకు జీవనాడి. పోరాటంలో అనేక మంది అసువులుబాసారని తెలిపారు. 68 గ్రామాలకు చెందిన 16 వేల కుటుంబాలు 26,500 ఎకరాలు ఇచ్చాయని,  విశాఖ స్టీల్‌ ప్లాంట్ ఆంధ్రాకే కాదు.. దేశానికే గర్వకారణమని ప్రధాని అన్నారు.

Also Read:స్టీల్ ప్లాంట్ రగడ: రంగంలోకి చంద్రబాబు, ప్రైవేటీకరణ వద్దంటూ మోడీకి లేఖ

1991- 2000 మధ్య కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 4,000 కోట్ల నష్టాలు వచ్చాయి. దీంతో అప్పటి అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్‌స్ట్రక్షన్ (బీఐఎఫ్‌ఆర్‌)కు రెఫర్ చేశారు.

అయితే  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం రూ. 1,033 కోట్ల ప్యాకేజీ ఇవ్వడంతో ప్లాంట్ మళ్లీ లాభాల పట్టిందని చంద్రబాబు గుర్తుచేశారు. 

సొంత గనులు లేకపోవడం వల్లే స్టీల్ ప్లాంట్‌ నష్టాల్లోకి వెళ్లిందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సొంత గనులు కేటాయించాలని టీడీపీ చీఫ్ విజ్ఞప్తి చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి.’’ అని ప్రధాని మోడీకి రాసిన లేఖలో చంద్రబాబు కోరారు.