పుంగనూరులో రాళ్లు, కర్రలతో టీడీపీ కార్యకర్తలతో గలాటా చేశారని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు వల్ల రాజకీయ నేతల విలువ పోతోందన్నారు.రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలకు నిబంధనలు ఒక్కటేనని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు వల్ల రాజకీయ నేతల విలువ పోతోందన్నారు. చంద్రబాబు లాగే ఆయన కార్యకర్తలూ వున్నారంటూ మంత్రి దుయ్యబట్టారు. పుంగనూరులో రాళ్లు, కర్రలతో గలాటా చేశారని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. పోలీసులను కొట్టేలా కార్యకర్తల్ని చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. లాఠీఛార్జ్‌కు చంద్రబాబే కారణమన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలకు నిబంధనలు ఒక్కటేనని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

ఇకపోతే.. చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం నియోజకవర్గానికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబు.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కుప్పంకు బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దు పెద్దూరుకు చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే తన కారులో నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు.. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. అయితే రాష్ట్రంలోని రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబు కుప్పం పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. 

ALso REad: నా నియోజకవర్గానికి రాకుండా పారిపోవాలా?.. తప్పుడు చట్టంతో జీవో ఇచ్చారు: వైసీపీ సర్కార్‌పై చంద్రబాబు ఫైర్

మరోవైపు చంద్రబాబు కొద్దిదూరం ముందుకు కదలగానే.. పోలీసులు ఆయన వద్దకు చేరుకున్నారు. రోడ్లపై ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చంద్రబాబుకు చెప్పారు. చంద్రబాబు రోడ్ షోను నిలిపివేయాలని కోరారు. ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు వాహనం నుంచి కిందకుదిగారు. తర్వాత చంద్రబాబుకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పర్యటనుకు ఎందుకు అనుమతి ఇవ్వరో సమాధానం చెప్పాలని, రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని పోలీసులను కోరారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నాయి.