ఆంధ్ర ప్రదేశ్ లో విద్యుత్ ఉద్యోగుల సమ్మెకు సిద్దమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైస్ జగన్ మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జలతో సమావేశమయ్యారు. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్దమైన విషయం తెలిసిందే. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ రాకుంటే ఆగస్ట్ 10 అంటే రేపటినుండి విధులను బహిష్కరించి సమ్మెకు దిగుతామని విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ సమ్మెను నిలువరించేందుకు ఏం చేయాలన్నదానిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన సబ్ కమిటీతో సమావేశమయ్యారు. 

ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సీఎం జగన్ భేటీ అయ్యారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. విద్యుత్ ఉద్యోగుల సంఘాలతో చర్చలు జరిపి సమ్మెకు వెళ్లకుండా ఒప్పించాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు.

సీఎంతో సమావేశం అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ... విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం ఉండదన్నారు. ఉద్యోగుల ప్రభుత్వం ముందుంచిన 12 డిమాండ్లపై ముఖ్యమంత్రితో చర్చించామని... సమస్యల పరిష్కారంపై ఆయన సానుకూలంగా వున్నట్లు మంత్రి తెలిపారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఉద్యోగసంఘాల జేఏసీ నేతలను చర్చలకు పిలిచామని... సీఎస్ తో పాటు మంత్రులు,అధికారులు వారి డిమాండ్లపై చర్చిస్తామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. 

Read More బాబు వర్సెస్ పెద్దిరెడ్డి: కాలేజీ రోజుల నుండి కొనసాగుతున్న ఆధిపత్య పోరు,పై చేయి ఎవరిదో?

గత నెల 20వ తేదీన తమ డిమాండ్లపై ప్రభుత్వానికి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు. 12 డిమాండ్లను విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వం ముందుంచారు. వేతన ఒప్పందంతోపాటు పలు అంశాలను విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వం ముందుంచారు. ఈ నెల 7వ తేదీన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో చర్చలు జరిపారు. అయితే చర్చలు విఫలమయ్యాయి.

అయితే మరోసారి చర్చలకు పిలుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రభుత్వం నుండి చర్చల కోసం విద్యుత్ ఉద్యోగుల జేఏసీ వేచి చూస్తుంది. దీంతో రేపు సమ్మెకు దిగుతారనగా ఇవాళ ప్రభుత్వం మరోసారి విద్యుత్ ఉద్యోగులతో చర్చలు జరపనుంది. ఈ చర్చలు సఫలమై విద్యుత్ ఉద్యోగులు సమ్మెను విరమిస్తారన్న ఆశాభావాన్ని మంత్రి పెద్దిరెడ్డి వ్యక్తంచేసారు.