Asianet News TeluguAsianet News Telugu

సాయంత్రం ఆరు లోపే ఇసుక డోర్ డెలివరీ..వారికోసమే: జగన్ ప్రభుత్వ నిర్ణయం

గుంటూరు జిల్లాలో నూతన ఇసుక పాలసీపై జరిగిన  సమీక్షా సమావేశం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. 

Minister  Peddireddi Ramachandra Reddy  Conduct  Review Meeting on Sand Policy
Author
Amaravathi, First Published Jun 1, 2020, 8:31 PM IST

అమరావతి: అర్థరాత్రి సమయాల్లో క్వాలిటీ లేని ఇసుకను డోర్ డెలివరీ చేస్తున్నారనే విమర్శల నేపథ్యంలో ఇకపై సాయంత్రం 6 గంటల వరకే ఇసుకను డెలివరీ చేయడానికి అనుమతిస్తున్నట్లు రాష్ట్ర భూగర్భగనుల శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాత్రి సమయాల్లో ఇసుకను డెలివరీ చేయడం వల్ల వినియోగదారులు నష్టపోతున్నారని ఎమ్మెల్యేలు కూడా చెబుతున్నారని...ఈ పరిస్థితిని మార్చేందుకు వెలుతురు వున్నప్పుడే ఇసుక డోర్ డెలివరీ జరగాలని నిర్ణయించినట్లు మంత్రి  తెలిపారు. 

నూతన ఇసుక పాలసీపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, మేకతోటి సుచరిత, మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఎపిఎండిసి విసిఅండ్ ఎండి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ సామ్యూల్ ఆనంద్ కుమార్, గుంటూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

''సాయంత్రం లోపే ఇసుకను వినియోగదారులకు అందించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై మైనింగ్ అధికారులు ట్రాన్స్ పోర్టర్లకు స్పష్టత ఇవ్వాలి. గుంటూరు జిల్లాలో రానున్న వర్షాకాలం కోసం పదిలక్షల టన్నుల ఇసుకను నిల్వ చేయాలని లక్ష్యంగా నిర్ణయించాం. ఇప్పటి వరకు 2.16 లక్షల టన్నులు మాత్రమే నిల్వ చేశారు. మిగిలిన ఇసుకను సైతం మరో ఇరవై రోజుల్లో స్టాక్ చేయాల్సి వుంది. ఇందుకోసం వర్షాకాలం స్టాక్ కోసం పట్టాభూముల్లో 24 గంటల పాటు ఇసుక ఆపరేషన్లకు అనుమతి ఇస్తున్నాం'' అన్నారు. 

''వాగులు, వంకల్లో నిబంధనల ప్రకారం ఎడ్లబండ్ల ద్వారా ఇసుకను తీసుకోవచ్చు. ఎడ్లబండ ద్వారా తీసిన ఇసుకను నిల్వచేయడం, లారీలకు విక్రయించడం చేస్తే మాత్రం చర్యలు తప్పవు. నూతన ఇసుక పాలసీ వల్ల సామాన్యుడికి ఇసుక సులువుగా లభించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే అన్ని జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధులు, మైనింగ్ అధికారులు, ఇసుక ట్రాన్స్ పోర్టర్ లతో సమావేశాలు పెడుతున్నాం. జిల్లాల వారీగా వున్న సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం'' అన్నారు. 

''గత ప్రభుత్వం ఉచిత ఇసుక పేరుతో పూర్తిగా దోపిడీకి పాల్పడింది.  సాక్షాత్తు అప్పటి సీఎం చంద్రబాబు నివాసంకు సమీపంలోనే ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి.
 దీనిపై గ్రీన్ ట్రిబ్యునల్ రూ.వందకోట్లు జరిమానా కూడా విధించింది. ఇటువంటి తప్పుడు విధానాలకు మా ప్రభుత్వం పూర్తి విరుద్దం'' అన్నారు. 

''ఆన్ లైన్ లో ఇసుకను బుక్ చేసుకోవాలంటే నో స్టాక్ అని వస్తోందని పలువురు చెబుతున్నారు. దీనిని కూడా అతి త్వరలోనే పరిష్కరించబోతున్నాం. గ్రామ సచివాలయాల ద్వారా ఇసుకను బుక్ చేసుకునే విధానంను పరిశీలిస్తున్నాం. సీఎం గారికి దీనిపై నివేదిక ఇచ్చి అనుమతి తీసుకుంటాం. దీనివల్ల ఎవరైనా ఒకే ఆధార్ తో ఎక్కువసార్లు ఇసుక బుక్ చేసుకుంటే సోషల్ ఆడిట్ లో దొరికిపోతారు. అలాగే గ్రామస్థాయిలో నిజంగా ఇసుక అవసరం వున్నవారే బుక్ చేస్తున్నారో లేదో తెలిసిపోతుంది'' అన్నారు. 

read more  అసలీ లంకారెడ్డి ఎవరు? ఆ కాంట్రాక్ట్ ఆయనకే ఎందుకంటే: జగన్ పై ఉమ ఫైర్

''బల్క్ బుకింగ్ ల పేరుతో ఇష్టారాజ్యంగా ఇసుకను తీసుకునేందుకు ఇక వీలు లేదు. ప్రతి బల్క్ బుకింగ్ పైనా రీ వెరిఫికేషన్ చేయిస్తున్నాం. స్టాక్ పాయింట్లను కూడా రీచ్ కు పదికిలోమీటర్ల లోపులోనే ఏర్పాటు చేయాలని ఆదేశించాం. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చెప్పిన సమస్యలను పరిగణలోకి తీసుకుంటున్నాం. అధికారులతో చర్చించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం'' అని మంత్రి వెల్లడించారు.

''ఉపాధి హామీ, నాడు-నేడు పనులకు ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. పట్టాభూముల్లో అనుమతులు తీసుకుని ఇసుక ఆపరేషన్లు చేయకపోతే వాటిని రద్దు చేస్తాం. ఇసుక లారీల జిపిఎస్ ట్రాకింగ్ ను 4జి నెట్ వర్క్ లతో మరింత సమర్థవంతంగా నిర్వహిస్తాం. జిల్లాల్లో ఇసుక పై ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. సచివాలయాల్లో టెలీకాన్ఫరెన్స్ ద్వారా జెసిలు ఇసుక ఆపరేషన్లపై ప్రతిరోజూ పర్యవేక్షించాలి'' అని ఆదేశించారు.

''జిల్లాల్లో ఇసుక మైనింగ్ పై అదనంగా ఒక జాయిట్ డైరెక్టర్ ను పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేశాం. జాయింట్ డైరెక్టర్లు ఇసుక ఆపరేషన్లను పర్యవేక్షిస్తారు. జిల్లా ఎమ్మెల్యేలు అదనంగా స్టాక్ యార్డ్ లను పెట్టాలని కోరారు. దానినికూడా పరిశీలిస్తాం. డీకాస్టింగ్ భూముల్లో ఇరవై నాలుగు గంటలపాటు ఆపరేషన్లు చేయవచ్చు.  ఇసుక తవ్వకాలకు ముందుకు రాని కాంట్రాక్టర్లను తొలగించి కొత్త వారికిఇవ్వండి'' అని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios