చిత్తూరు జిల్లా కుప్పంలోని రూరల్‌ ఎలక్ట్రిక్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ (రెస్కో) వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిని క్లారిటీ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన రెస్కోను ఎపీఎస్పీడీసీఎల్‌లో విలీనం చేయబోమని ఆయన స్పష్టం చేశారు. ఈఆర్సీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇస్తామని పేర్కొన్నారు.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లా ఎమ్మెల్యేలు, కీలక నేతలతో సమావేశమైన రామచంద్రారెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో ఏపీ పథకాల గురించి చర్చించుకునేలా విజయం సాధిస్తామని పెద్దిరెడ్డి తెలిపారు. ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. 

కాగా, రెస్కో స్వాధీనానికి ఏపీఎస్పీడీసీఎల్‌కు ఏపీఈఆర్‌సీ ఇచ్చిన ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు నిన్న ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

విద్యుత్‌ అమ్మకం, పంపిణీ, రిటైల్‌ లైసెన్స్‌ మినహాయింపు పొందడంలో విఫలమైందనే కారణాలు చూపుతూ రెస్కోను స్వాధీనం చేసుకుంటున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఇది సరైన చర్య కాదంటూ శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రతిపక్షనేత లేఖ రాశారు