అనంతపురం: తమ కుటుంబం నిత్యం ప్రజల కోసమే పనిచేస్తుందని ఏపీ మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కుక్కలపల్లి కాలనీ పంచాయితీలో ఆరోవిడత జన్మభూమి మాఊరు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తాను తన కుమారుడు పరిటాల శ్రీరామ్ ప్రజాసేవకే అంకితమన్నారు. 

అవసరమైతే ప్రజల కోసం ప్రాణాలు సైతం అర్పించేందుకు సిద్ధమన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ వైసీపీ నాయకుడిగా కంటే కోడికత్తిపార్టీ నాయకుడిగానే ప్రజలు గుర్తుపడుతున్నారని విమర్శించారు. 

సీఎం చంద్రబాబు ఐదు కోట్ల ప్రజలకు సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు ఒక వైపు మోదీ, మరోవైపు జగన్ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. 

జగన్ ప్రధాని మోదీతో కుమ్మక్కై చంద్రబాబును తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తూ తమపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తుంటారని, వాటన్నింటికీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి చూపించి బుద్ధిచెప్పాలని మంత్రి పరిటాల సునీత ప్రజలను కోరారు.