ఏందిది సామీ... చంద్రబాబు ఏమైనా పరదాల సీఎం అనుకుంటిరా..: జగన్ పై లోకేష్ సెటైర్లు
చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో కలిసి తిరమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలపై పరదాలు కనిపించడంతో పరోక్షంగా వైఎస్ జగన్ పై పెటైరికల్ కామెంట్స్ చేసారు నారా లోకేష్.
తిరుమల : గత ఐదేళ్ల జగన్ పాలనపై వచ్చినన్ని విమర్శలు ఏ ప్రభుత్వంపైనా రాలేవు. ప్రజా వేదిక కూల్చివేత నుండి మొన్నటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వరకు వైఎస్ జగన్ ఏం చేసినా ప్రతిపక్షాలు విమర్శించేవారు. జగన్ తీసుకునే నిర్ణయాల్లో తప్పులు వెతికి పట్టుకుని సోషల్ మీడియా వేదికన విస్తృత ప్రచారం చేసేవారు. ఇక జగన్ ను నియంత, సైకో అని... తాడేపల్లి ప్యాలస్ లో పబ్జీ ఆడుకోవడం తప్ప అతడికేం తెలియదంటూ విమర్శించేవారు. బయటకు వెళ్ళిన సమయంలో ప్రజలకు భయపడి పోలీసులతో పరదాలు కట్టించేవారని... ఈయన పరదాల సీఎం అంటూ ఎద్దేవా చేసేవారు. ఇలా వైఎస్ జగన్ పై జరిగిన ప్రచారం కూడా తాజాగా వైసిపి ఓటమికి ఓ కారణం.అయితే వైఎస్ జగన్ ను ఓడినా ఆయనపై ట్రోలింగ్ మాత్రం ఆపడంలేదు టిడిపి... తాజాగా మంత్రి నారా లోకేష్ మాజీ సీఎంను ట్రోల్ చేసారు.
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి అద్భుత విజయాన్ని సాధించింది. 175 కు 175 సీట్లు గెలుస్తామన్న వైసిపిని కేవలం 11 సీట్లకే పరిమితం చేసి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసింది. ఇలా భారీ విజయం సాధించిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది... నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణంస్వీకారం కూడా చేసారు. ఆయన తనయుడు నారా లోకేష్ కూడా మరోసారి మంత్రిగా ప్రమాణం చేసారు.
అయితే ప్రమాణస్వీకారం అనంతరం చంద్రబాబు కుటుంబం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. నిన్న బుధవారమే తిరుమలకు చేరుకున్న చంద్రబాబు ఆండ్ ఫ్యామిలీ ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఇలా తిరుమల కొండపై చంద్రబాబు, నారా లోకేష్ లు తిరుగుతుండగా ఓ విషయాన్ని గమనించారు. దీనిపై చంద్రబాబు కాస్త సీరియస్ గా రియాక్ట్ అయితే... నారా లోకేష్ మాత్రం కాస్త ఫన్నీగా వైఎస్ జగన్ ను ట్రోల్ చేసారు.
అసలేం జరిగింది :
గతంలో వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లినా భారీ పోలీస్ భద్రతను ఏర్పాటుచేసుకునేవారు... ప్రజాగ్రహం ఎక్కువగా వున్న ప్రాంతాల్లో పరదాలు కట్టేవారు. ఇది అలవాటయ్యిందో ఏమోగాని చంద్రబాబు ఫ్యామిలీ పర్యటన నేపథ్యంలో తిరుమలలో పరదాలు కట్టారు అధికారులు. ఇది గమనించిన సీఎం చంద్రబాబు వెంటనే వాటిని తొలగించాలని... తమకోసం భక్తులకు అసౌకర్యం కలగించవద్దని సూచించారు. దీంతో అధికారులు పరదాలను తొలగిస్తుండగా నారా లోకేష్ గమనించారు.
''ఏం పరదాలు కట్టారు. సచ్చిపోతున్నా పోలీసోళ్లకు చెప్పిచెప్పి. వందంటున్నా కడుతున్నారు'' అంటూ పరోక్షంగా మాజీ సీఎం వైఎస్ జగన్ పై సెటైర్లు వేసారు. మనకు పరదాలు అవసరం లేదు... ఇక నుంచి కట్టవద్దు అని పోలీసులను కోరారు నారా లోకేష్. పరదాల గురించి లోకేష్ సెటైర్లు వేస్తుంటే అక్కడున్నవాళ్లంతా గొళ్లున నవ్వారు.