Asianet News TeluguAsianet News Telugu

ఇప్పటంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా పవన్ హడావిడి చేస్తున్నారు.. మంత్రి మేరుగ నాగార్జున మండిపాటు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమాయకుడని.. అయితే అతడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాయలో పడ్డారని ఏపీ మంత్రి మేరగ నాగర్జున అన్నారు. చంద్రబాబు నాయుడు కబంధ హస్తాల్లో పవన్ చిక్కుకున్నాడని  ఆరోపించారు. 

minister merugu nagarjuna Slams pawan kalyan and chandrababu naidu
Author
First Published Nov 5, 2022, 1:24 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమాయకుడని.. అయితే అతడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాయలో పడ్డారని ఏపీ మంత్రి మేరగ నాగర్జున అన్నారు. చంద్రబాబు నాయుడు కబంధ హస్తాల్లో పవన్ చిక్కుకున్నాడని  ఆరోపించారు. గుంటూరు జిల్లాలోని ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగానే ఇళ్లు కూల్చారని చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోకుండా పవన్ కల్యాణ్ హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. 

చంద్రబాబు నాయుడు ఆయనపై రాళ్లు, చెప్పులు వేయించుకుని లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. రాయి, గొడవ.. ఇదంతా చంద్రబాబు కుట్రలో భాగమేనని విమర్వించారు.చంద్రబాబుపై రాయి వేయించాల్సిన అవసరం తమకు లేదన్నారు. తాము ఏమైనా వీక్‌గా ఉన్నామా అంటూ ప్రశ్నించారు. తమ నాయకుడు పనిచేయని వ్యక్తి కాదని.. రాష్ట్రంలో తమకు బలమైన మద్దతు ఉందని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలకు సైతం సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు.  

ఇదిలా ఉంటే.. గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు అక్కడ పర్యటిస్తున్నారు. ఇప్పటంలో కూల్చివేసిన ఇళ్లను పరిశీలిస్తున్న పవన్ కల్యాణ్.. నిర్వాసితులకు తాము ఉన్నామనే భరోసా కల్పిస్తున్నారు. ఇళ్ల కూల్చివేతకు గురైన నిర్వాసితులు కూడా పవన్ కల్యాణ్ వద్ద వారి బాధను చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. పీవీ నర్సింహారావు, ఇందిరా గాంధీ, మహాత్మ గాంధీ విగ్రహాలను కూడా కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు విస్తరణ చేసేందుకు ఇదేమైనా కాకినాడానా?, రాజమండ్రినా? అని ప్రశ్నించారు. పెదకాకానిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇంటి ముందు విస్తరణ వర్తించదా అని ప్రశ్నించారు. 

మార్చి నెలలో జనసేన సభకు భూములు ఇచ్చిన కారణంగానే వీళ్ల మీద కక్ష కట్టి ఏప్రిల్ నెలలో కూల్చివేత నోటీసులు ఇచ్చారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. వైసీపీ గుండాలు ఇలాగే చేస్తే.. తాము ఇడుపులపాయలో హైవే వేస్తామని హెచ్చరించారు. గుంతలు పూడ్చలేరు, రోడ్లు వేయలేరు.. కానీ రోడ్ల  విస్తరణ కావాలా అని ప్రశ్నించారు. సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన శ్రేణులు ధర్నాలు చేయాలని.. కానీ పోలీసులపై చేయి వేయవద్దని సూచించారు. అయితే ఆగకుండా చేతులు కట్టుకుని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. పోలీసులు కూడా సమస్యలు ఉన్నాయని అన్నారు.  వైఎస్సార్ విగ్రహాం ఉంచి.. జాతీయ నాయకుల విగ్రహాలు కూల్చడమేమిటని ప్రశ్నించారు. బీఆర్ అంబేడ్కర్ కంటే రాజశేఖరరెడ్డి ఎక్కువ అని ప్రశ్నించారు. పులివెందుల తరహా రాజకీయం ఇక్కడ చేస్తే నడవదని బలంగా చెప్పమని ప్రజలకు సూచించారు. 

పవన్ కల్యాణ్ ఇప్పటంలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటం పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక,  ఇప్పటంలో పర్యటించేందుకు పవన్ కల్యాణ్ శుక్రవారం రాత్రి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరకున్నారు. శనివారం ఉదయం ఇప్పటం వెళ్లడానికి బయలుదేరిన పవన్ కల్యాణ్‌ను మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ముందు పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇప్పటం వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తెలుపడంతో.. పవన్ కల్యాణ్ తన వాహనం దిగి నడుచుకుంటూ ఇప్పటం చేరుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios