వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి కొట్టు సత్యనారాయణ. పవన్‌ చేతికి అసలు ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ ఎలా వచ్చిందో తెలియడం లేదన్నారు. కరోనా సమయంలో వాలంటీర్ల సేవలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని ఆయన పేర్కొన్నారు.  

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు మంత్రి కొట్టు సత్యనారాయణ. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ చేతికి అసలు ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ ఎలా వచ్చిందో తెలియదన్నారు. అది చంద్రబాబు రిపోర్ట్ అయి వుండొచ్చని కొట్టు సత్యనారాయణ సెటైర్లు వేశారు. వాలంటీర్ల నియామకంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించామని.. పవన్ అజ్ఞానంతో మాట్లాడుతున్నాడని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉన్మాదంతో ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను ఆయన మాట్లాడుతున్నారని కొట్టు సత్యనారాయణ దుయ్యబట్టారు. కరోనా సమయంలో వాలంటీర్ల సేవలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ మాత్రం పిచ్చోడిలా మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రూ.పది వేలలోపు ఆదాయం ఉన్న ఆలయంలోని అర్చకులకు రూ.10 వేలు జీతం ఇవ్వాలని నిర్ణయించినట్లు కొట్టు సత్యనారాయణ తెలిపారు. తద్వారా మొత్తం 1146 మంది అర్చకులకు జీతాలు పెరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు.

ALso Read: పవన్ కు స్ట్రాంగ్ కౌంటర్... దళిత మహిళా వాలంటీర్ కాళ్ళుకడిగిన వైసిపి ఎమ్మెల్యే (వీడియో)

మరోవైపు.. వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంంటీర్ వ్యవస్థపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏపీలో అమ్మాయిల మిస్సింగ్ కు వాలంటీర్లే కారణమంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సేకరిస్తున్న కొందరు వాలంటీర్లు ఆ సమాచారాన్ని వైసిపి నాయకులకు ఇస్తున్నారంటూ పవన్ ఆరోపణలు చేసారు. ఇలా వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేసిన పవన్ పై వైసిపి నాయకులు మండిపడుతున్నారు. మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే తనదైన స్టైల్లో పవన్ కు కౌంటరిచ్చారు. 

మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పర్యటించారు. ఈ క్రమంలోనే పవన్ వాలంటీర్ వ్యవస్థను అవమానించేలా మాట్లాడటంపై ఆర్కే స్పందించారు. ప్రజలకోసం పనిచేస్తున్న వాలంటీర్లను ప్రశంసించకపోయినా పరవాలేదు... అవమానించడం తగదంటూ పవన్ కు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ దళిత మహిళా వాలంటీర్ రజిత కాళ్లుకడిగారు ఎమ్మెల్యే. అనంతరం ఆమెకు శాలువా కప్పి, పూలదండతో సత్కరించారు.