నాలుగు వూళ్లలో తిరిగి పనికిమాలిన మాటలు మాట్లాడితే ప్రజలు ఏ రకంగా గుణపాఠం చెబుతారో మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిదర్శనమన్నారు మంత్రి కొడాలి నాని. తాడేపల్లిలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించారని చెప్పారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు గాను కరోనా వచ్చినా, ఆర్ధిక పరిస్ధితులు బాగోకపోయినా మేనిఫెస్టోని అమలు చేస్తున్నారని నాని వెల్లడించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి  చేయాలనే లక్ష్యంతో మూడు రాజధానులను జగన్ ప్రకటించారని తెలిపారు.

అందుకే ప్రాంతాలతో సంబంధం లేకుండా వన్ సైడ్ విజయం కట్టబెట్టారని నాని వెల్లడించారు. వైఎస్ జగన్‌పై చంద్రబాబు విషయం కక్కుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఎన్నికల ముందు ఓ మాట.. తర్వాత మరో మాట మాట్లాడుతున్నారంటూ మంత్రి ధ్వజమెత్తారు.

ఎన్నికల్లో ఓటు వేయాలంటూ ఓ చిన్న వీడియో కానీ, ప్రెస్ మీట్ కానీ లేకపోయినా జనం జగన్‌ని నమ్మారని నాని చెప్పారు. రాష్ట్రప్రజలు ఈ తీర్పుతో చంద్రబాబుని తరిమేశారని.. ఆయన హైదరాబాద్‌లో పాచి పనులు చేసుకుంటున్నారని కొడాలి నాని సెటైర్లు వేశారు.

సీఎం జగన్ జనానికి ఎలా దగ్గరయ్యారో చంద్రబాబు నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు అడుగుపెట్టొద్దని నాని డిమాండ్ చేశారు. రామోజీరావు, బీఆర్ నాయుడు, రాధాకృష్ణ, నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌లు కలిసి అమరావతిలో మహిళలు, రైతుల ముసుగులో కుట్రలు చేశారని కొడాలి నాని ఆరోపించారు.

అమరావతి నుంచి రాజధానిని పూర్తిగా తీసివేయడం లేదని.. కేవలం పరిపాలనా రాజధానిని విశాఖ, న్యాయ రాజధాని కర్నూలుకు వెళ్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఎల్లో మీడియా మాటలు నమ్మొద్దని నాని రాజధాని రైతులకు విజ్ఞప్తి చేశారు.

రైతులు తమకు కావాల్సింది ఏంటో తెలుసుకుని ఓ ఎజెండా ద్వారా ప్రభుత్వంతో చర్చిస్తే.. వారికి జగన్ న్యాయం చేస్తారని నాని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తామే గెలిచామంటూ టపాసులు కాల్చిన చంద్రబాబు.. ఈరోజు మీడియా ముందుకు ఎందుకు రాలేదని మంత్రి ప్రశ్నించారు.

తాము బూతుల మంత్రులం, కొబ్బరి చిప్పల మంత్రులం కాదని.. చంద్రబాబు వెనుక కాల్ మనీ సెక్స్ రాకెట్ మనుషులు వున్నారని నాని ఎద్దేవా చేశారు. ఏబీఎన్, టీవీ 5లలో చర్చలు, డిబేట్లు ఆపకుండా తెలుగుదేశం పార్టీని ఏపీలో ముంచేయాలంటూ మంత్రి సెటైర్లు వేశారు.

కులం, మతం లేకుండా అందరికీ సమానంగా సంక్షేమ పథకాలు అందించామన్నారు. చంద్రబాబుకు మొసళ్ల పండుగ ముందుందన్నారు. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి టీడీపీ క్లోజ్ అవుతుందని కొడాలి నాని జోస్యం చెప్పారు.