స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని గవర్నర్‌కు లేఖ రాయడానికి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎవరిని ప్రశ్నించారు మంత్రి కొడాలి నాని. గవర్నర్‌కు సలహాలు ఇచ్చే స్థాయి నిమ్మగడ్డకు లేదన్నారు .

ప్రజలను, ప్రభుత్వాన్ని, గవర్నర్‌ను లెక్కచేయని నిమ్మగడ్డను తాము ఈసీగా గుర్తించబోమని కొడాలి నాని స్పష్టం చేశారు. చంద్రబాబు బినామీ నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్తామంటే తాము ఒప్పుకొమని మంత్రి వెల్లడించారు.

చంద్రబాబు బూట్లు నాకే నిమ్మగడ్డకు ఎన్నికలు నిర్వహించే హక్కులేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అటు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడికి మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు.

వేసవి కాలంలోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. వైసీపీ 90 శాతం పంచాయతీలు, మున్సిపాలిటీలు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొడాలి నాని సవాల్ విసిరారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే వేసవిలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలకు జగన్ భయపడుతున్నారని అనడం అవివేకమని నాని చెప్పారు. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 మంది అభ్యర్థులను నిలబెట్టలేకపోవడం చంద్రబాబు అసమర్థత అన్నారు. పోటీ చేసిన 106 మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారని.. అలాంటి టీడీపీని జాతీయపార్టీ అని ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలా టీడీపీని చంద్రబాబు పతనం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు.. ప్రజానేత సీఎం జగన్‌ను ఢీ కొడతాననడం విచిత్రంగా ఉందని.. టీడీపీని చంద్రబాబు గాలి పార్టీగా తయారుచేసి.. ఆయన ఒక గాలి నాయకుడిగా మిగిలిపోయారన్నారు.