టీడీపీ నేత నారా లోకేశ్‌పై మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడి ఇంటిని బాత్‌రూమ్‌తో పోలుస్తారా అంటూ ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం కట్టే ఇళ్లు జగన్ బాత్‌రూమ్‌ అంత సైజు కూడా లేవంటారా అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

జగన్ బాత్‌రూమ్‌ని లోకేశ్ ఎప్పుడు చూశారంటూ నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు, లోకేశ్‌లు ఎలాంటి ఇళ్లలో ఉంటే ఇలా మాట్లాడతారంటూ దుయ్యబట్టారు. దీనిని బట్టి టీడీపీ నేతల తీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

కాగా, ఇళ్ల పట్టాల పంపిణీని పురస్కరించుకుని నారా లోకేశ్ నిన్న వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. బులుగు రంగు వేసినంత మాత్రానా తమ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ బ్రాండ్ చేరిగిపోయేది కాదని అన్నారు.

వైఎస్ జగన్ బెంగళూరులో నిర్మించుకున్న కోటలోని మరుగుదొడ్డి కంటే తక్కువ స్థలంలో పేదలకు ఇళ్ల పట్టాలను ఇస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. పైగా కొండలు, గుట్టలు,శ్మశానాలు, చెరువుల్లో ఇచ్చే స్థలంలో పేదలు నివసించే పరిస్థితి లేదని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న అవినీతి, అక్రమాలను చూస్తోంటే.. రాష్ట్రంలో జగనన్న జైలు పిలుస్తోంది పథకం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేశారు.