పాదయాత్రలో ఇచ్చని హామీ ప్రకారం కొత్త జిల్లాకు NTR పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు (YS Jagan) మంత్రి కొడాలి నాని (Kodali Nani) ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.
పాదయాత్రలో ఇచ్చని హామీ ప్రకారం కొత్త జిల్లాకు NTR పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు (YS Jagan) మంత్రి కొడాలి నాని (Kodali Nani) ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. శనివారం గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి కొడాలి నాని పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం హర్షనీయమని అన్నారు. ప్రపంచంలోని ఎన్టీఆర్ అభిమానుల తరపున సీఎం జగన్‌కు పాదాభివందనం చేస్తున్నామని అన్నారు.
ప్రజల కోసం కష్టపడిన ప్రతి నాయకుడిని ఆదర్శంగా తీసుకుని సీఎం జగన్ ముందుకు సాగుతున్నారని అన్నారు. 2014 నుంచి ఐదేళ్ల పాటు టీడీపీ రాష్ట్ర ప్రజలకు చేసిందేమి లేదన్నారు. సిద్దాంతపరంగా ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా వైఎస్సార్ పోరాటం చేసినప్పటికీ.. రాష్ట్రానికి, సినీ పరిశ్రమగా ఎన్టీఆర్ సేవలకు గుర్తుగా సీఎం జగన్ కొత్త జిల్లాకు పేరు పెట్టారని అన్నారు. అయితే కొందరు టీడీపీ నేతలు దీనిని కూడా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌పై చంద్రబాబుకు ఎంత ద్వేషం ఉందదో మరోమారు స్పష్టమైందన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
టీడీపీ తెలంగాణలో రాజకీయ సమాధి అయిందని.. ఏపీలో కూడా త్వరలోనే రాజకీయ సమాధి అవుతుందన్నారు. జిల్లాల పునర్విభజనలో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే తీసుకోవడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్ జయంతి, వర్దంతి రోజున భారతరత్నకు ఇవ్వాలని డిమాండ్ చేస్తారని.. కేంద్రంలో చక్రం తిప్పాననే చెప్పుకుంటాడే తప్ప ఏం చేయడని విమర్శించారు. ఎన్టీఆర్‌కు, వైఎస్సార్‌కు భారతరత్న ఇప్పించగలిగే పరిస్థితి ఉంటే.. వైసీపీ తప్పకుండా తీసుకొస్తుందని అన్నారు.
ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా చేస్తే నర్సపూర్‌లో వైసీపీ అభ్యర్థిని నిలబెడుతుందని చెప్పారు. క్యాసినో జరిగిందని టీడీపీ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. క్యాసిన్ ద్వారా 3 రోజుల్లో 500 కోట్లు వస్తే మరి గోవాలో ఎంత వస్తుందని ప్రశ్నించారు. ఒక్క క్యాసినో పెడితే రూ. 500 కోట్లు వస్తే.. గోవాలో 50 క్యాసినోలకు మూడు రోజుల్లో 25 వేల కోట్ల రూపాయలు వస్తాయి కదా అని ప్రశ్నించారు
నాలుగు సార్లు గుడివాడలో ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. చంద్రబాబు విధానాలతో విబేధించి.. వైఎస్ జగన్‌తో కలిశానని అన్నారు. 2014, 2019లలో తనను ఒడించడానికి టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. కానీ గుడివాడ ప్రజలు వారికి తగిన బుద్ది చెప్పారని అన్నారు. గుడివాడలో క్యాసినో జరిగితే గుడివాడ ప్రజలకు తెలియదా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు చీర్ బాయ్స్ చెబితే గుడివాడ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు చీర్ బాయ్స్ చెప్పే మాటలను.. గుడివాడ టీడీపీ నేతలు కూడా పట్టించుకోవడం లేదన్నారు. అయినప్పటికీ టీడీపీ పోలీసులకు, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తూ.. డ్రామా క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు.
తనపై ముఖ్యమంత్రి జగన్ యాక్షన్ తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తనను అల్లరి చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసు కాబట్టే.. ముఖ్యమంత్రి తనను ఏమి అనలేదని అన్నారు.
