రేషన్‌ డీలర్లను తొలగిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారానికి తెరదించారు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన అలాంటి ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో పేద ప్రజలు తినే రేషన్‌లో మార్పులు తెచ్చామని నాని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చే వాటికన్నా.. నాణ్యతతో ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని మంత్రి చెప్పారు.

దీని వల్ల ప్రభుత్వంపై రూ. 350 కోట్ల భారం పడ్డా నాణ్యమైన బియ్యం ఇస్తున్నామని కొడాలి నాని స్పష్టం చేశారు. కరోనా సమయంలోనూ ప్రజలపై భారం పడకుండా డీలర్లకు రూ.22 కోట్లు కమీషన్‌ రూపంలో ప్రభుత్వం ఇచ్చిందని మంత్రి వెల్లడించారు.

ఉచిత రేషన్‌ రూపంలో డీలర్లు ఇచ్చే కమీషన్‌ రూ.270 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరించిందని కొడాలి నాని చెప్పారు. అలాగే రేషన్‌ డీలర్లకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తామని త్వరలోనే చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.