భీమవరంలో దాడులకు ఉసిగొల్పింది లోకేషే... కేసులు పెట్టండి..: పోలీసులకు మంత్రి సూచన
భీమవరంలో యువగళం పాదయాత్ర పేరుతో నారా లోకేష్ అలజడి సృష్టిస్తున్నాడని... అతడిపై పోలీసులు కేసు పెట్టాలని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సూచించారు.

భీమవరం : టిడిపి నాయకులు రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నాడని... అందులో భాగమే నారా లోకేష్ యువగళం పాదయాత్రపై స్వీయ దాడులని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. చంద్రబాబుకు ఐటీ నోటీసుల నేపథ్యంలోనే ఈ కుట్రలకు తెరలేపారని... వీటిని సహించబోమని అన్నారు. భీమవరంలో జరిగిన దాడులపై పోలీసులు చర్యలు తీసుకుంటారని... దాడికి పాల్పడ్డ వారిమీదే కాదు ప్రోత్సహించిన లోకేష్ లాంటి వారిపైనా కేసులు పెట్టాలని మంత్రి కారుమూరి సూచించారు.
ప్రశాంతంగా వుండే గోదావరి జిల్లాలో అలజడి సృష్టిస్తే సహించబోమని మంత్రి హెచ్చరించారు. అసలు పాదయాత్రలోకి కర్రలు, రాళ్లు ఎందుకొచ్చాయి..? అని ప్రశ్నించారు. వేరే ప్రాంతాల నుంచి రౌడీ మూకలను తీసుకొచ్చి దాడులు చేయిస్తున్నారని... వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని అన్నారు. భీమవరంలో దాడులకు తెగబడ్డది రెడ్ టీషర్టులు వేసుకున్న రౌడీషీటర్లు... వీరంతా లోకేష్ వెంట వుండే అసాంఘిక శక్తులేనని మంత్రి ఆరోపించారు.
యువగళం పాదయాత్ర పేరుతో పశ్చిమ గోదావరి జిల్లాలో విధ్వంసం సృష్టించేందుకు లోకేష్ ఆండ్ బ్యాచ్ ముందుగానే కుట్రలు పన్నారని కారుమూరు ఆరోపించారు. ఎర్రదండు పేరుతో యువగళం వాలంటీర్లే కర్రలు, రాడ్లతో గొడవ సృష్టించారని అన్నారు. వైసిపి ప్లెక్సీలను చించింది వారే... గొడవ చేసింది వారేనని మంత్రి అన్నారు. చివరకు భీమవరంలోని సామాన్యుల ఇళ్లలోకి వెళ్లి మరీ టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని మంత్రి ఆరోపించారు.
Read More కారణమిదీ: లోకేష్‌కు భీమవరం పోలీసుల నోటీసులు
లోకేష్ తీరు చూస్తుంటే అసలాయన చదువుకున్నాడా అన్న అనుమానం కలుగుతుందన్నారు. మొదటి నుండి లోకేష్ టిడిపి శ్రేణులనే కాదు వైసిపి నాయకులను రెచ్చగొట్టేలా వుంటున్నాయని అన్నారు. మీపై కేసులు ఎన్ని ఎక్కువుంటే అంత పెద్ద పదవి ఇస్తానంటూ బహిరంగంగానే టిడిపి శ్రేణులను రెచ్చగొడుతున్నాడని అన్నారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి ఎక్కడికక్కడ దాడులు, దౌర్జన్యాలతో స్వైరవిహారం చేస్తున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు.
ఇటీవల తండ్రి పుంగనూరులో గొడవలు సృష్టిస్తే ఇప్పుడు కొడుకు భీమవరంలో విధ్వంసకాండ సృష్టించాడని మంత్రి కారుమూరి ఆరోపించారు. ఐటీ నోటీసులతో తండ్రీ కొడుకులు ఫ్రస్టేషన్ పెరిగిందని... ఎక్కడ తమ దోపిడీ బయటపడుతుందోనని భయపడిపోతున్నారని అన్నారు. రూ.118 కోట్లు చంద్రబాబుకు ముడుపులు అందాయని... ఇందులో లోకేష్ కు కూడా భాగస్వామ్యం వుందని మంత్రి ఆరోపించారు. ఈ విషయం నుండి ప్రజల దృష్టి మరల్చడానికే దాడులతో విధ్వంసం సృష్టిస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు.