ఏపీలో అలజడులకు టిడిపి కుట్రలు...: మంత్రి కారుమూరి సంచలనం
స్కిల్ డెవలప్ మెంట్ పేరిట ప్రజాధనాన్ని దోచుకున్న చంద్రబాబు కోసం రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు ప్రతిపక్ష టిడిపి కుట్రలు పన్నుతోందని మంత్రి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేసారు.

అమరావతి : ప్రశాంతంగా వున్న ఆంధ్ర ప్రదేశ్ లో అలజడులు సృష్టించేందుకు ప్రతిపక్ష టిడిపి కుట్రలు చేస్తోందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన చంద్రబాబు అరెస్ట్ అయ్యారని ప్రజలే అనుకుంటున్నారు... ఆయన గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదన్నారు. ప్రజల మద్దతు లేకపోవడంతో టిడిపి పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపిందని... వారిని ప్రజలవద్దకు పంపించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇలా చంద్రబాబు జైలుకు వెళ్లిన నాటినుండి అనేక కుట్రలు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
గత టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండగా స్కిల్ డెవలప్ మెంట్ పేరిట స్కామ్ జరిగిందని... రూ.371 కోట్ల ప్రజాధనం మెక్కేసారని మంత్రి ఆరోపించారు. ఈ పథకానికి వెంటనే నిధులు విడుదల చేయాలని స్వయంగా చంద్రబాబే 13 చోట్ల సంతకాలు చేసారని... తప్పు చేసాడు అనడానికి ఇంతకంటే పెద్ద ఆధారాలు ఏముంటాయన్నారు. వందల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేయడంలో చంద్రబాబుకు ప్రత్యక్ష ప్రమేయం వుందని... కోర్టులు కూడా ఇదే నమ్ముతున్నాయన్నారు. తప్పుచేయబట్టే చంద్రబాబు జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వస్తోందని మంత్రి కారుమూరి అన్నారు.
అయితే అవినీతి చేసి జైలుకు వెళ్లిన చంద్రబాబు ఆ సొమ్మునే ఖర్చుచేసి బయటకు రావాలని చూస్తున్నారని కారుమూరి పేర్కొన్నారు. తన తరపున కోర్టుల్లో వాదించేందుకు కోట్లు తీసుకుని లాయర్లను చంద్రబాబు నియమించుకున్నారని అన్నారు. ఇలా లాయర్లకే కోట్లు వెదజల్లుతున్నారంటే చంద్రబాబు, ఆయన కుటుంబం ఏ స్థాయిలో దోపిడి చేశారనేది అర్ధమవుతుందని మంత్రి కారుమూరి అన్నారు.
Read More రాజమండ్రి బయలుదేరిన లోకేష్... మాజీ మంత్రులను అడ్డుకున్న పోలీసులు, తీవ్ర ఉద్రిక్తత (వీడియో)
చంద్రబాబు అవినీతి కేసుల నుండి బయటపడేందుకు ప్రజలను ఇబ్బంది పెట్టడానికి సిద్దమయ్యాడని కారుమూరి ఆరోపించారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తున్నారని అన్నారు. ఇలా చంద్రబాబు ప్రజలవద్దకు యాక్టర్లను పంపిస్తుంటే జగన్ మాత్రం డాక్టర్లను పంపిస్తున్నారని అన్నారు. వైసిపి ప్రభుత్వం ఆరోగ్య సురక్ష పేరిట ప్రజారోగ్యాన్ని కాపాడే పథకాన్ని తీసుకువచ్చిందని... వైద్యులనే ప్రతి ఇంటికి పంపించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించి మంచి వైద్యం అందించే ఏర్పాటు ప్రభుత్వమే చేసిందని మంత్రి తెలిపారు.
పద్నాలుగేళ్ల సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన చంద్రబాబు ఏం చేసారో చెప్పగలరా? చెప్పుకోడానికి ఒక్కటంటే ఒక్కటి లేదని మంత్రి కారుమూరి అన్నారు. ఏమీ చేయకున్నా ఎల్లో మీడియాకు చంద్రబాబును ఆకాశానికి ఎత్తడం అలవాటేనని అన్నారు. చంద్రబాబు పాలనలో తన వర్గానికి, రామోజీరావుకు మేలు జరిగిందని మంత్రి నాగేశ్వరరావు ఆరోపించారు.
వైసిపి పాలనలో ప్రజలు ఆనందంగా వున్నారు... అందువల్లే చంద్రబాబును పట్టించుకునేవారు లేకుండా పోయారన్నారు. దీంతో ఎలాగయినా రాష్ట్రంలో అలజడులు సృష్టించే దురుద్దేశంతోనే టీడీపీ పూటకో ఆందోళనకు పిలుపునిస్తోందని అన్నారు. కానీ ఆందోళనలు చేసేందుకు టిడిపి కార్యకర్తలు కూడా లేకుండా పోయారంటూ మంత్రి ఎద్దేవా చేసారు.