బాబు కుట్రలను తిప్పికొట్టి.. జగన్‌ను మరోసారి సీఎంగా గెలిపించాలి : మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
చంద్రబాబు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాని.. జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్ ప్రతి కుటుంబానికి చేరువయ్యారని నాగేశ్వరరావు వెల్లడించారు.

గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్ పదవి మంత్రి పదవి కంటే పెద్దదన్నార మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఆదివారం గుంటూరు మిర్చి యార్డ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, అంబటి రాంబాబు , ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తదితరులు హాజరయ్యారు. ఆ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్ పదవిని జగన్ బీసీ వర్గానికి కేటాయించారని ప్రశంసించారు. ఎస్సీ, బీసీలతో పాటు ఆర్ధికంగా వెనుకబడిన వారికి మేలు చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారని కారుమూరి కొనియాడారు.
ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లపైనా మంత్రి మండిపడ్డారు. వారిద్దరూ వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, పథకాల కోసం మహిళలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాని.. జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు పేదవారు ఇంజనీరింగ్ చదవగలిగారా అని కారుమూరి ప్రశ్నించారు. వైఎస్ఆర్, జగన్ హయాంలో మాత్రమే పేద విద్యార్ధులు ఇంజనీర్లు కాగలుగుతున్నారని మంత్రి పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్ ప్రతి కుటుంబానికి చేరువయ్యారని నాగేశ్వరరావు వెల్లడించారు. విద్యావ్యవస్ధలో సీఎం సమూల మార్పులు తెచ్చారని.. విద్యావ్యవస్ధలో దేశంలోనే మన రాష్ట్రం మూడో స్ధానంలో వుందని మంత్రి పేర్కొన్నారు.
Also Read: బీజేపీ అంటే బాబు జనతా పార్టీ కాదు: పురంధేశ్వరిపై విజయసాయి రెడ్డి సెటైర్లు
ఇకపోతే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లపై మంత్రి జోగి రమేష్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్మక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సింహాన్ని ఎదుర్కొనేందుకు గంట నక్కలు, ఊరకుక్కలు ఒక్కటయ్యాయని విమర్శించారు. చంద్రబాబు, పవన్‌లకు అసలు ఏపీలో ఆధార్, సొంతిల్లు వుందా అని జోగి రమేశ్ ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో వుంటూ ఆంధ్రప్రదేశ్‌పై విషం కక్కుతున్నారని మంత్రి దుయ్యబట్టారు.
దమ్ము, ఖలేజా వుంటే సింగిల్‌గా పోటీ చేయాలని చంద్రబాబు, పవన్‌లకు జోగి రమేష్ సవాల్ విసిరారు. ఎన్నికలకు నక్కలు , కుక్కలు, పందులు కలిసి వస్తాయని.. కానీ సింహం సింగిల్‌గానే వస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈసారి జరిగే ఎన్నికల్లో కోనసీమ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండా ఎగురవేస్తామని జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు.