ఏపీ సీఆర్‌డీఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులు గవర్నర్ వద్దకు చేరడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ ఎందుకు వ్యతిరేకిస్తోందని ఆయన ప్రశ్నించారు.

ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా టీడీపీ నేతలు, వారి అనుయాయుల ప్రయోజనాలను కాపాడాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు. అసెంబ్లీ నియమ నిబంధనలకు అనుగుణంగానే ప్రభుత్వం ఈ రెండు బిల్లులను ప్రవేశపెట్టామని కన్నబాబు తెలిపారు.

ఆ రోజు బిల్లుపై చర్చ సందర్భంగా చంద్రబాబు గ్యాలరీలో కూర్చొని.. మండలి ఛైర్మన్‌కు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. యనమల రాజ్యాంగ నిపుణుడిలా బిల్డప్ ఇస్తారని ఆయన మండిపడ్డారు.

చంద్రబాబు కోసం ఎన్టీఆర్‌ను కూలదోసిన నాటి నుంచి నేటి వరకు ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారో లెక్కేలేదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్దిని ఎందుకు అడ్డుకుంటున్నారని కన్నబాబు ప్రశ్నించారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ వెళితే అభివృద్ది వికేంద్రీకరణ గురించి ప్రజాభిప్రాయం ఎంటో తెలుస్తుందన్నారు. అమరావతిని అంత ప్రేమిస్తే.. ఐదేళ్ల కాలంలో అక్కడ ఏం చేశారని మంత్రి నిలదీశారు.

శాసనమండలిలో రెండోసారి ప్రవేశపెట్టిన బిల్లులు నెల రోజులు గడవటంతో నిబంధనల ప్రకారం అసెంబ్లీ అధికారులు గవర్నర్ వద్దకు పంపారని కన్నబాబు తెలిపారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 192 క్లాజ్ 2 ప్రకారం... ప్రభుత్వం రెండోసారి శాసనమండలిలో బిల్లు ప్రవేశపెడితే, నెల రోజుల తర్వాత అవి ఆమోదించినట్లుగానే పరిగణించాలని ఆయన చెప్పారు.