టీడీపీ నేత ఆనం వెంకట రమణా రెడ్డిపై దాడి ఘటనపై స్పందించారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఆయనపై ఎవరు దాడి చేశారో పోలీసులు తేలుస్తారని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు చేసే కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
టీడీపీ నేత ఆనం వెంకట రమణా రెడ్డిపై గుర్తుతెలియని దుండగుల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆనం అనుచరులు ప్రతిఘటించడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. లేనిపక్షంలో ఏం జరిగేదోనని టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నారు. దీని వెనుక వైసీపీ నేతలు వున్నారంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆనంపై దాడి ఎవరు చేశారు అనేది పోలీసులు తేలుస్తారని అన్నారు. కానీ ఈ లోపే సజ్జల పేరు, నా పేరు, ఇలా ఎవరికి తోచిన పేరు వాళ్లు చెబుతున్నారని గోవర్థన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు చేసే కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. కోర్టులో చోరీ విషయంలో ఏం జరిగిందో త్వరలోనే తేలుతుందని ఆయన పేర్కొన్నారు. అప్పుడే ఈ అంశంపై స్పందిస్తానని కాకాణి గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు.
ALso Read: నెల్లూరులో టీడీపీ నేత ఆనం వెంకట రమణా రెడ్డిపై దాడికి యత్నం.. వైసీపీ పనేనన్న లోకేష్
ఇకపోతే.. ఆదివారం నెల్లూరు నగరంలోని ఆర్టీఏ కార్యాలయం నుంచి ఆనం బయటకు వస్తుండగా బైక్‌లపై వచ్చిన దుండగులు కర్రలతో ఆయనపై దాడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ కార్యకర్తలు, అనుచరులు తీవ్రంగా ప్రతిఘటించడంతో దుండగులు పారిపోయారు. గడిచిన కొంతకాలంగా ఆనం వెంకట రమణా రెడ్డి వైసీపీ పాలనపై విమర్శలు గుప్పిస్తున్నారు. నెల్లూరు యాసలో ఆయన వేసే పంచ్‌లు టీడీపీ కేడర్‌కు, ప్రజలకు నేరుగా కనెక్ట్ అవుతాయి.
మరోవైపు ఆనంపై దాడి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు అక్కడికి చేరుకున్నారు. వెంకట రమణా రెడ్డితో మాట్లాడి దాడిపై ఆరా తీశారు. అటు ఆనంపై దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. ఇది ఖచ్చితంగా వైసీపీ మనుషుల పనేనని ఆయన ఆరోపించారు. వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలకు తగిన గుణపాఠం చెబుతామని లోకేష్ స్పష్టం చేశారు.
