కుప్పంలోనే కుదేలైన చంద్రబాబు ఇక పులివెందులలో ఏం చేస్తాడంటూ ప్రశ్నించారు మంత్రి జోగి రమేశ్. పులివెందులని టచ్ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ఆయన నిలదీశారు. ఎన్ని జాకీలు పెట్టి లేపినా చంద్రబాబు, ఆయన కుమారుడు ఇక లేవలేరని మంత్రి సెటైర్లు వేశారు.
ప్రతిపక్షనేత , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి జోగి రమేశ్. శనివారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేతలు, కార్యకర్తలను యుద్ధం చేయమని చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం ప్రజల తిరుగుబాటుకు భయపడి పారిపోయిన వ్యక్తి చంద్రబాబని జోగి రమేశ్ దుయ్యబట్టారు. కానీ కార్యకర్తలను మాత్రం బలి చేయాలని చూస్తున్నారని.. కోర్టులలో తాను చూసుకుంటానని చెప్పటం దారుణమన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సీఎం పదవి పొందిన వ్యక్తి పండుగ చేసుకోవటం సిగ్గు చేటని... సెప్టెంబర్ 2 అంటే తెలుగు ప్రజలంతా వైఎస్ఆర్ ని గుర్తు చేసుకుంటారని జోగి రమేశ్ పేర్కొన్నారు. అలాంటి రోజున పార్టీ సమావేశం పెట్టి జగన్ని తిట్టడం మొదలు పెట్టారని.. రెండు లక్షల కోట్లు అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
డీబీటి ద్వారా మేము లక్షా 70 వేల కోట్లు నేరుగా జనానికి అందించామని.. దీనిపై చర్చకు రావాలని జోగి రమేశ్ సవాల్ విసిరారు. అవినీతి కేసులు విచారణ జరగనీయకుండా స్టే తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబని.. దమ్ముంటే వాటిపై విచారణ జరిపించుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. సెప్టెంబరు ఒకటో తేదీ అంటే అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవంగా గుర్తు పెట్టుకున్నారని.. అలాంటి వ్యక్తి కూడా జగన్ ని విమర్శించటం సిగ్గుచేటంటూ జోగి రమేశ్ దుయ్యబట్టారు. ఎన్ని జాకీలు పెట్టి లేపినా చంద్రబాబు, ఆయన కుమారుడు ఇక లేవలేరని మంత్రి సెటైర్లు వేశారు. అంబేద్కర్, పూలే ఆశయాలు ఏపీలో కొనసాగుతున్నాయని.. సొంత పార్టీ నేతలే చంద్రబాబుని నమ్మటం లేదని ఆయన చురకలు వేశారు.
ALso Read:ఏపీకి పెట్టుబడులు రావొద్దనేది టీడీపీ కోరిక.. మంత్రి అంబటి రాంబాబు ఫైర్
అందుకే గొడవలు చేయమని కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని.. పరిశ్రమలు రాకుండా అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని జోగి రమేశ్ ఆరోపించారు. రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందని చేసిన ఆరోపణపై చంద్రబాబు చర్చకు రావాలని.. ఎక్కడకు రావాలో చెప్తే అక్కడకే మేము వస్తామని మంత్రి సవాల్ విసిరారు. పులివెందులని టచ్ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని జోగి రమేశ్ ప్రశ్నించారు. కుప్పంలోనే కుదేలైన ఆయన ఇక పులివెందులలో ఏం చేస్తాడంటూ మంత్రి ఎద్దేవా చేశారు. చంద్రబాబు పెద్ద మేధావి అని మోడీ అడిగారా? చెప్పుకోవటానికైనా సిగ్గుండాలంటూ జోగి రమేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
