సైకో పాలన ఏనాడో పోయింది... సైకో బాబు రాజమండ్రి జైలుకు..: మంత్రి జోగి రమేష్
చంద్రబాబు అరెస్ట్ పై చర్చకు పట్టుబడుతూ శాసనసభలో ఆందోళనకు దిగిన ప్రతిపక్ష టిడిపి ఎమ్మెల్యేలకు మంత్రి జోగి రమేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

అమరావతి : టిడిపి సభ్యుల ఆందోళనలతో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో రెండో రోజూ గందరగోళమే నెలకొంది. సభ మొదలవగానే టిడిపి ఎమ్మెల్యేలు చంద్రబాబు అరెస్ట్ పై చర్చకు పట్టుబడుతూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. చంద్రబాబుపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా 'సైకో పాలన పోవాలి' అంటూ నినాదాలు చేసారు. టిడిపి సభ్యుల ఆందోళన, సభలో ప్లకార్డుల ప్రదర్శన, నినాదాలపై మంత్రి జోగి రమేష్ సీరియస్ అయ్యారు.
చంద్రబాబును విడుదల చేయాలని కోరాల్సింది శాసనసభను కాదు కోర్టులను అని టిడిపి సభ్యులకు జోగి రమేష్ సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్లకార్డులు స్పీకర్ పోడియం వద్ద కాకుండా కోర్టు వద్ద ప్రదర్శించాలని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఓటమితోనే సైకో పాలన పోయిందని... ఇప్పుడు వున్నది సుపరిపాలన మాత్రమేనని అన్నారు. ప్రస్తుతం సైకో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడని అన్నారు. ఖైధీ నెంబర్ 7691 బాబు బొక్కలో వున్నాడని మంత్రి అన్నారు.
ఇలా బాలకృష్ణ బావ చంద్రబాబు జైల్లో వున్నారంటూ జోగి రమేష్ సభలో పదేపదే సంబోధించారు. స్కిల్ డెవలప్ వ్యవహారంపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా వుందని... అయినా కావాలనే టిడిపి సభ్యులు సభలో ఆందోళన చేపడుతున్నారని అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని... సభా మర్యాదలు పాటించాలని హెచ్చరించారు. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్న టిడిపి నాయకులను బయటకు పంపాలని స్పీకర్ ను కోరారు మంత్రి జోగి రమేష్.
Read More ఏపీ అసెంబ్లీలో గందరగోళం:విజిల్ ఊదుతూ నిరసనకు దిగిన బాలకృష్ణ
ఇదిలావుంటే శాసనసభలో నిబంధనలకు విరుద్దంగా సెల్ ఫోన్లతో వీడియో తీసినందుకుగాను టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బెందాళం ఆశోక్ లు స్పీకర్ సస్పెండ్ చేసారు. నిన్న కూడా ఇలాగే సభా కార్యకలాపాలను వీడియో తీసిన టిడిపి సభ్యులను స్పీకర్ హెచ్చరించారని... అయినా వారిలో మార్పు రాలేదని చీఫ్ విప్ ప్రసాదరాజు అన్నారు. అచ్చెన్నాయుడు, అశోక్ సెల్ పోన్ తో వీడియోలు చిత్రీకరిస్తున్నారని చీఫ్ విప్ స్పీకర్ దృష్టికి తీసుకువచ్చాడు. దీంతో వారిని సమావేశాలు పూర్తయ్యేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
ఇక టిడిపి ఎమ్మెల్యేలు సభా కార్యకలాపాలకు అడ్డుపడుతూ నిరసనలు చేపట్టడంపై మంత్రి అంబటి రాంబాబు సీరియస్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పీకర్ పోడియం వద్దకు వచ్చి విజిల్ ఊదుతూ నిరసనకు తెలపడం దారుణమని... బావకళ్లలో ఆనందం కోసమే ఇదంతా చేస్తున్నాడని అన్నారు. చంద్రబాబు సీటుపై కాదు... చంద్రబాబుపై ఎక్కి కూర్చోవాలని బాలకృష్ణకు సూచించారు అంబటి రాంబాబు.