రాష్ట్ర భవిష్యత్తు జగనన్నే అనే సర్వేలో 7 లక్షల మంది జగనన్న సైనికులు పాల్గొన్నారని చెప్పారు మంత్రి జోగి రమేష్. ఈ మెగా పీపుల్స్ సర్వే భారత రాజకీయ చరిత్రలోనే అరుదైన ఘట్టంగా మంత్రి అభివర్ణించారు. 

జగనన్నే మన భవిష్యత్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతోందన్నారు మంత్రి జోగి రమేశ్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు జగనన్నే అనే సర్వేలో 7 లక్షల మంది జగనన్న సైనికులు పాల్గొన్నారని చెప్పారు. వారం రోజుల్లోనే వీరంతా 61 లక్షల ఇళ్లను సందర్శించారని.. జగనన్నకు మద్ధతుగా 47 లక్షల మంది మిస్డ్ కాల్ చేశారని జోగి రమేశ్ పేర్కొన్నారు. ఈ మెగా పీపుల్స్ సర్వే భారత రాజకీయ చరిత్రలోనే అరుదైన ఘట్టంగా మంత్రి అభివర్ణించారు. 

అంతకుముందు మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. గత టిడిపి ప్రభుత్వానికి ప్రస్తుత వైసిపి ప్రభుత్వానికి తేడా ఏమిటో ప్రజలకు తెలియజేయడమే 'జగనన్నే మా భవిష్యత్' కార్యక్రమ ఉద్దేశ్యమని తెలిపారు. పార్టీ కన్వీనర్లు, గృహ సారథులు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వంలో, ప్రస్తుత వైసిపి ప్రభుత్వంలో అభివృద్ది, సంక్షేమం ఎలా సాగుతుందో వివరిస్తారని బొత్స తెలిపారు. ఇలా ఈ కార్యక్రమం ద్వారా కోటీ 80 లక్షల కుటుంబాలను కార్యకర్తల ద్వారా వైసిపిని చేరువ చేస్తామని అన్నారు. ఈ నెల 20 వరకు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. జగన్ మాత్రమే మా భవిష్యత్ అనే నినాదంతో ముందుకు వెళుతున్నామని బొత్స పేర్కొన్నారు. 

ALso Read : జగన్ స్టిక్కర్లు షర్మిల, సునీత ఇళ్లకు అతికించే దమ్ముందా?: వంగళపూడి అనిత

దేశ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేర్చిందని... మేనిపెస్టో లోని ప్రతి అంశాన్ని నూటికి నూరు శాతం నెరవేర్చామని అన్నారు. నాలుగేళ్ళ పాలన ముగించుకుని ఐదో ఏట అడుగుపెడుతున్న వేళ ప్రజలతో మరింత మమేకం అయ్యేందుకు జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని బొత్స పేర్కొన్నారు.