అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ తనకు అర్హత లేదు, అనుభవం లేదని చెప్పే పవన్ కళ్యాణ్ ఏ అర్హతతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. దశ, దిశ, స్థిరత్వం లేకుండా ఎప్పుడు ఏవిధంగా మాట్లాడతారో పవన్ కళ్యాణ్ కే తెలియదని విమర్శించారు. అలాంటి పవన్ కళ్యాణ్ తన పౌరుషం గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని దానిపై పోరాడాలని కోరారు. వెనుకబడిన జిల్లాకు సంబంధించి రూ.350కోట్లు విడుదల చెయ్యడంలో జాప్యం చేస్తోందని దానిపై కేంద్రాన్ని నిలదీయాలని లేఖలో పేర్కొన్నారు. 

ఇటీవలే మంత్రి జవహర్ పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సామాజిక వర్గానికి చెందిన ప్రజలను కులం పేరుతో దూషిస్తుంటే జవహర్ కు పౌరుషం రావడం లేదా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తన పౌరుషంపై మంత్రి జవహర్ కౌంటర్ ఇచ్చారు.