జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని జిల్లాలు ఉన్నాయనేది కూడా పవన్ కల్యాణ్‌కు తెలియదని విమర్శించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని జిల్లాలు ఉన్నాయనేది కూడా పవన్ కల్యాణ్‌కు తెలియదని విమర్శించారు. పవన్ కల్యాణ్‌కు ఫెడరల్ విధానం గురించి తెలుసా..? అని ప్రశ్నించారు. పవన్ అజ్ఞాతవాసి అని సినిమా తీస్తే బాగుంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్‌ కల్యాణ్‌ను జనవాణిలో నిలదీస్తామని హెచ్చరించారు. ఉత్తరాంధ్రపై జనసేన వైఖరి చెప్పాల్సిందేనని అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేకలో పవన్ కల్యాణ్ జోకర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా నిర్వహించే గర్జన నుంచి ప్రజల దృష్టిని మల్లించడానికే పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన అని మండిపడ్డారు. 

Scroll to load tweet…


ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. వికేంద్రీకరణ అనేది సర్వతోముఖాభివృద్ధికి మంత్రమని వైసీపీ భావిస్తే.. ఏపీకి మూడు రాజధానులకే ఎందుకు పరిమితం చేయాలి? అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఏపీని ‘‘యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ ఆంధ్ర’’ ప్రకటించాలని సెటైర్లు వేశారు. ‘‘25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి.. 25 రాజధానులకు వెళ్లండి. ఏపీని మీ వైసీపీ రాజ్యంగా మార్చుకోండి. దయచేసి సంకోచించకండి.. ఫ్రీగా ఫీల్ అవ్వండి’’ అని పవన్ ట్వీట్ చేశారు. 

‘‘ఏది ఏమైనప్పటికీ వైసీపీ నేతలు.. చట్టం, న్యాయవ్యవస్థ, రాజ్యాంగానికి అతీతంగా ఉన్నట్లు విశ్వసిస్తారని, ప్రవర్తిస్తారు. మిగిలిన పౌరులు ఏమి భావిస్తున్నారో, ఏం చెబుతున్నారో ఒక్క పైసా కూడా పట్టించుకోరు’’ అని వైసీపీ నాయకులపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

మరోవైపు యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాలోని దక్షిణ డకోటాలోని ‘‘మౌంట్‌ రష్‌మోర్’’ ఫొటోను షేర్ చేసిన పవన్ కల్యాణ్.. అది ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛ-విశ్వాసాలకి చిహ్నం అని పేర్కొన్నారు. ‘‘యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ ఆంధ్ర’’ విశాఖ జిల్లాలోని రుషికొండ పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ “మౌంట్‌ దిల్‌ మాంగే మోర్‌’’.. ధన - వర్గ - కులస్వామ్యానికి చిహ్నం.. పీఎస్‌ (బూతులకి కూడా…) అంటూ పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

ఇక, ఈ నెల 15వ తేదీ నుండి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన జనసేన నేతలతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. మూడు జిల్లాల నేతలకు పవన్ కళ్యాణ్ దిశా నిర్ధేశం చేయనున్నారు. ఉత్తరాంధ్ర జనసేననేతలు, వాలంటీర్లతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఈ నెల 16వ తేదీన విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.